
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇవ్వాల్టి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వరకు జరగనున్న ఈ ఎగ్జామ్స్.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఫస్టియర్ స్టూడెండ్లు 4,88,448 మంది, సెకండియర్‌లో 5,08,523 మంది ఉన్నారు. వీరి కోసం 1,532 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఆయా సెంటర్ల పర్యవేక్షణ కోసం 29,992 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించామని, దీనిని స్కాన్ చేసి కేటాయించిన సెంటర్లకు స్టూడెంట్లు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్టేట్ కంట్రోల్ రూమ్ 90402 05555 నంబర్‌కు కాల్ చేయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు.
విద్యార్థులు పరీక్షల భయంతో మానసికంగా ఇబ్బందులకు గురైతే టెలీ మానస్ 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. పరీక్షా సమయానికి అరగంట ముందే ఆయా సెంటర్లకు స్టూడెంట్లు చేరుకోవాలని కోరారు.