
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, బీఈడీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్) షెడ్యూల్‍ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఏ కోర్సులో చేరాలంటే ఏ పరీక్ష రాయాలి, కామన్ ఎంట్రన్స్ టెస్టుల ప్యాటర్న్, ఎగ్జామ్ తేదీల సమాచారం తెలుసుకుందాం..
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎంసెట్ (ఇంజినీరింగ్; అగ్రికల్చర్, ఫార్మసీ) సహా 6 ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంసెట్‌ను మే 7 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పీజీ ఇంజినీరింగ్ సెట్‌ను మొత్తం 4 రోజులు నిర్వహిస్తున్నారు. మిగిలిన అన్ని పరీక్షలు మే నెలలోనే నిర్వహించనుండగా, పీజీఈసెట్ జూన్ 1న కూడా ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలను సంబంధిత సెట్ కన్వీనర్లు త్వరలో ప్రకటించనున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి నోటిఫికేషన్ల జారీ మొదలవుతుంది. మార్చి మొదటి వారంలో ఎంసెట్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఎంసెట్, పీజీఈసెట్‌లను జేఎన్‌టీయూహెచ్; ఈసెట్, లాసెట్‌లను ఉస్మానియా యూనివర్సిటీ; ఎడ్‌సెట్‌ను మహాత్మాగాంధీ వర్సిటీ, ఐసెట్‌ను కాకతీయ వర్సిటీలు నిర్వహిస్తాయి.
ఈసెట్: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ వంటి డిప్లొమా హోల్డర్లు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ కలిగిన అభ్యర్థులకు బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా 2వ సంవత్సరంలో ప్రవేశించడానికి వీలు కల్పించే పరీక్ష ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్). బీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశించడానికి అనర్హులు. కనీసం 45 శాతం మార్కులతో స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు దాదాపు 32 ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ లో మాత్రమే 200 మార్కులకు ఉంటుంది. డిప్లొమా, ఫార్మసీ పుస్తకాల్లోని సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయి. ఇంజినీరింగ్ వారికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ సబ్జెక్టు, ఫార్మసీ స్ట్రీమ్ వారికి ఫార్మసీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.
పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ నోటిఫికేషన్‌ను స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కౌన్సిల్ విడుదల చేయనుంది. ఈసెట్ పరీక్ష మే 20న నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం polycetts.nic.in వెబ్సైట్ సంప్రదించాలి.
లాసెట్/ పీజీఎల్‍సెట్: ఈ పరీక్ష క్వాలిఫై అయిన వారు రాష్టంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ లా కళాశాలల్లో మూడు లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, రెండేళ్ల ఎల్‍ఎల్‍ఎం కోర్సుల్లో ప్రవేశించవచ్చు. మూడేళ్ల ఎల్‍ఎల్‍బీ కోర్సుకు కనీసం 45 శాతం మార్కులతో 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ, ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఎల్‍ఎల్‍ఎం లో ప్రవేశానికి మూడేళ్ల ఎల్‍ఎల్‍బీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా చదివిన వారు అర్హులు. పరీక్షలో 120 మార్కులకు 120 ప్రశ్నలుంటాయి. సమయం 90 నిమిషాలు. మూడేళ్ల లా పేపర్‍లో ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఐదేళ్ల లా పేపర్ ఇంటర్ స్థాయిలో ఉంటాయి. లా ఆప్టిట్యూడ్‍లో బేసిక్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ లా అండ్ ఇండియన్ కాన్‍స్టిట్యూషన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. లాసెట్ పరీక్ష మే 25న నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం www.lawcet.tsche.ac.in వెబ్సైట్ చూడాలి.
ఎడ్‍సెట్: టీచర్ అవ్వాలంటే డిగ్రీతో పాటు బీఈడీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ కోర్సు చదవాలంటే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్సెట్) రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారు రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చదవొచ్చు. ఇందుకు కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్), బీసీఏ, బీబీఏ, బీబీఎం లేదా ఏదైనా పీజీ ఉత్తీర్ణత. కోర్సులో చేరిన తర్వాత అభ్యర్థి తీసుకునే సబ్జెక్టు మెథడాలజీ ఆధారంగా అదే సబ్జెక్టు నుంచి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఎడ్‌సెట్ ఎగ్జామ్ మే 18న నిర్వహించనున్నారు. వివరాలకు www.edcet.tsche.ac.in వెబ్సైట్ సంప్రదించాలి.
పీఈసెట్: విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి రాయాల్సిన పరీక్ష ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్). బీపీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
పీజీఈసెట్: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ (పీజీఈసెట్) రాష్ర్టంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ-డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పరీక్ష. పీజీలో చేరే సబ్జెక్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్, ఫార్మా, బీఆర్క్, ఎంసీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్, డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. కంప్యూటర్ బేస్డ్ ఆన్‍లైన్ టెస్టులో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. సమయం రెండు గంటలు. పీజీఈసెట్ పరీక్ష మే 29, 30, 31, జూన్ 1న నిర్వహిస్తారు. సమాచారం కోసం www.pgecet.tsche.ac.in వెబ్సైట్లో చూడాలి.
సెట్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్). ఇందులో అర్హత సాధించిన ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు బీటెక్, బీఈ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో చేరొచ్చు. బైపీసీ స్ట్రీ మ్ అభ్యర్థులు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫారెస్ర్టీ, బీవీఎస్సీ ఎనిమల్ హజ్బెండరీ, బీఎఫ్‍ఎస్సీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మా-డి (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఇంటర్మీడియట్‍లో 45 శాతం మార్కులతో బైపీసీ, ఎంపీసీ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దీనికి అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంసెట్ పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఎంసెట్ (ఇంజినీరింగ్) పరీక్షలు మే 7 నుంచి మే 11 వరకు నిర్వహించనున్నారు. ఎంసెట్ (అగ్రికల్చర్, ఫార్మసీ) ఎగ్జామ్స్ మే 12 నుంచి -14 వరకు పెడతారు. మరిన్ని వివరాల కోసం eamcet.tsche.ac.in వెబ్సైట్ సంప్రదించాలి.
ఐసెట్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ర్టేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఆప్లికేషన్స్(ఎంసీఏ) కోర్సుల్లో (ఫుల్‍టైం/పార్ట్‌టైం/ఈవెనింగ్/డిస్టెన్స్) చేరేందుకు రాయాల్సిన ప్రవేశ పరీక్ష ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్). ఎంబీఏ కోర్సులకు ఓరియంటల్ లాంగ్వేజ్‍లో తప్ప ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఎంసీఏ కోర్సులకు ఇంటర్ లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలో మొత్తం అనలిటికల్ ఎబిలిటి, మ్యాథ్స్, కమ్యూనికేషన్ ఎబిలిటి సెక్షన్‍ల నుంచి 200 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఐసెట్ పరీక్షను మే 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. వివరాల కోసం www.icet.tsche.ac.in వెబ్సైట్ సంప్రదించాలి.
- వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్