తెలంగాణ ఇంటర్ పరీక్షలపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక ప్రకటన

తెలంగాణ ఇంటర్ పరీక్షలపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక ప్రకటన

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక విషయాలను వెల్లడించారు. ఎల్లుండి నుంచి (మార్చి 5, 2025) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 1532 సెంటర్లలో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయని, అందులో అత్యధికంగా 244 సెంటర్లు హైదరాబాద్లోనే ఉన్నాయని ఆయన వివరించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని చెప్పారు. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మీటింగ్స్ కూడా పూర్తయ్యాయని, ఆర్టీసీ అధికారులను కూడా అలర్ట్ చేశామని వెల్లడించారు.

దూర ప్రాంతాలకు బస్సులు నడపాలని కోరామని, హాల్ టికెట్ల పంపిణీ కూడా పూర్తయిందని తెలిపారు. 9 తర్వాత కూడా ఐదు నిమిషాల ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని, 8:45 నిమిషాలకే విద్యార్థులు సెంటర్లకు చేరుకోవాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య సూచించారు. హడావిడిగా రావద్దని విద్యార్థులను ఆయన అలర్ట్ చేశారు. 

కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నామని, ప్రతీ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా NPDCL, SPDCL అధికారులతో మాట్లాడామని, సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. క్యూ ఆర్ కోడ్ కూడా హాల్ టికెట్లో ఇచ్చామని, దాన్ని స్కాన్ చేయడం ద్వారా సెంటర్కు ఈజీగా చేరుకోవచ్చని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ వివరించారు.

* రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు 9,96,971
* ఫస్ట్ ఇయర్  స్టూడెంట్స్ .. 4,88,448
* సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ .. 4,40,788
* సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ (ప్రైవేట్ ).. 67,735
* మొత్తం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. 5,08,523