
- టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే చాన్స్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఈసారి ఎండలు మండిపోనున్నాయి. ఇప్పటికే 2023లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక టెంపరేచర్లు రికార్డ్కాగా.. ఈసారి దానిని మించి నమోదయ్యే ప్రమాదం ఉందని వెదర్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ ఎండాకాలంలో 48 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్లు టచ్ అయ్యే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్నేయం నుంచి వేడి గాలుల ప్రభావం మొదలవడంతో ఫిబ్రవరిలోనే టెంపరేచర్లు సాధారణం కన్నా మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఇదే పరిస్థితి రాబోయే మూడు నెలలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సారి ఎండాకాలంలో మార్చి, ఏప్రిల్ నెలలు చాలా కీలకమని వాతావరణ నిపుణులు, అధికారులు చెబుతున్నారు. ఆ రెండు నెలల్లో ఉండే ఎండ తీవ్రతపైనే మే నెల పరిస్థితులు ఆధారపడి ఉంటాయని అంటున్నారు. మార్చిలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
వెదర్ మారుతున్నది..
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఇటీవలి కాలంలో క్రమంగా మారుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సెమి అరిడ్ (అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు) జోన్లో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు క్రమంగా మరింత వేడి వాతావరణానికి మారుతున్నట్టు చెబుతున్నారు. కొన్నేండ్లుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పీక్ స్టేజ్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు రికార్డ్ అవుతున్నట్టు చెబుతున్నారు. 2023 జూన్ 9న కాజీపేటలో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 48.9 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటున్నారు.
ఎల్నినో ఎఫెక్ట్
క్రమంగా ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఆ పరిస్థితితో వేడి గాలులు ఇటువైపు వీస్తున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని సిటీల్లో ఎండ వేడి రికార్డ్ అయిన టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. సిటీలు విస్తరిస్తుండడం, కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం, వాహనాల వాడకం ఎక్కువ అవుతుండడంతో అర్బన్ హీట్ ఐలాండ్స్ పరిస్థితి ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది
11 జిల్లాల్లో 37 డిగ్రీలకుపైగానే నమోదు
రాష్ట్రంలో శనివారం 11 జిల్లాల్లో 37 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 37.5, మహబూబ్నగర్, నాగర్కర్నూల్లలో 37.4, జగిత్యాలలో 37.3, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 37.2 డిగ్రీలు రికార్డయ్యాయి. నిరుడు ఇదే టైంతో పోలిస్తే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అధికంగా రికార్డయ్యాయి.
ముందస్తు చర్యలు తీసుకుంటే బెటర్
ఎండాకాలంలో టెంపరేచర్లు పెరిగితే ఏం చేయాలనేదానిపై సర్కార్ ముందస్తు యాక్షన్ ప్లాన్ను ప్రిపేర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కూలు పిల్లలు, వృద్ధులపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి.. వారిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని చెబుతు న్నారు. వడదెబ్బ ఘటనలను తగ్గించుకునేం దుకు ఆరోగ్య శాఖ తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధమవ్వా లంటున్నారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ, హెల్త్, ఎడ్యుకేషన్, వెదర్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా దీనిపై కార్యాచరణ రూపొందించాలని చెబుతున్నారు.