- జాన్సన్ నాయక్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం
- ఖానాపూర్ సెగ్మెంట్ లో విచిత్ర పరిస్థితి
నిర్మల్, వెలుగు: జిల్లాలోని ఖానాపూర్ సెగ్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను బీఆర్ఎస్నేతలు, అధికారులు ఒంటరి చేస్తున్నారు. అధిష్టానం ఆమెకు కాకుండా మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుడైన జాన్సన్ నాయక్ కు టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆమె పవర్ కట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టికెట్ రాక పోవడంతో రేఖ నాయక్ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించడం, తాను పోటీ లో ఉండబోతున్నానంటూ ప్రకటించడం, కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం వల్ల పార్టీలో ఆమెపై వ్యతిరేకత మొదలైనట్లయింది.
మొన్నటి వరకు మందీ మార్భలం తో తిరిగిన ఆమె ప్రస్తుతం ఒంటరిగా మిగిలి పోయారు. ఇదిలా ఉండగా రేఖా నాయక్ పీఏను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అధికారిక కార్యక్రమాలకు కూడా నామ మాత్రపు ఆహ్వానాలు పంపుతున్నారు.
ఇటీవల నిర్మల్ లో మెడికల్ కాలేజ్ ప్రారంభానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి జాన్సన్ నాయక్ హాజరవ్వడం పెద్ద చర్చనీయాంశమైంది. దీంతోపాటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల విడుదల విషయం లో కూడా తనకు ప్రాధాన్యత నివ్వడం లేదని రేఖా నాయక్ కంట నీరు పెట్టుకున్నారు. గృహలక్ష్మి, మైనారిటీ బంధు లబ్ధిదారుల జాబితా తయారీ వ్యవహారమంతా జాన్సన్ నాయక్ కనుసైగల్లోనే జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
పోలీస్ అధికారులు రేఖా నాయక్ ఇంటికి గా కుండా జాన్సన్ నాయక్ ఇంటికి వెళ్తున్నారు. ఆయన సిఫారసుల మేరకే కొత్త సీఐని నియమించారనే ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ నాయకులంతా ఆమె ను ఒంటరి చేసి జాన్సన్ నాయక్ వెంట నడుస్తుండడం, అధికారులు సైతం ఆమెకు ప్రాధాన్యత నివ్వకుండా జాన్సన్ నాయక్ కు సమాచారం అందిస్తుండడం నియోజకవర్గంలో చర్చ నీయాంశంగా మారుతోంది. మొన్నటి వరకు ఫైర్ బ్రాండ్ గా వున్న రేఖా నాయక్ టికెట్ రాక పోవడంతో డీలా పడి పోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.