- ఎమ్మెల్యే హరిప్రియకు బీఫాం రాకుండా చక్రం తిప్పుతున్న అసమ్మతి నేతలు
- మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య రాజీకి తెరచాటు యత్నాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇల్లెందు బీఆర్ఎస్లో అసమ్మతి ముదురుతోంది. ఎమ్మెల్యే హరిప్రియకు బీ ఫాం రాకుండా అసమ్మతి నేతలు చక్రం తిప్పుతున్నారు. అలాగే అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య రాజీకి తెర వెనుక యత్నాలు జోరందుకున్నాయి. మున్సిపల్ చైర్మన్తో కలిసి నడిస్తే తాము వ్యతిరేకిస్తామని 11 మంది బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు హెచ్చరిక జారీ చేశారు.
బీ ఫాం రాకుండా యత్నాలు
ఎమ్మెల్యే, బీఆర్ఎస్ క్యాండిడేట్ భానోత్ హరిప్రియకు బీ ఫాం రాకుండా అసమ్మతి నేతలు పైరవీలు చేస్తున్నారు. హరిప్రియకు టికెట్ఇస్తే తాము పనిచేయలేమంటూ నియోజకవర్గంలోని ఇల్లెందు టౌన్, ఇల్లెందు, టేకులపల్లి, కామేపల్లి, బయ్యారం, గార్ల మండలాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు గతంలోనే మీటింగ్ పెట్టుకొని మరీ హెచ్చరించారు.
ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేలోగానే కేసీఆర్ హరిప్రియ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. బీ ఫారం ఇచ్చేనాటికి కొన్ని సర్దుబాట్లు ఉంటాయని కేసీఆర్ చెప్పడంతో అసమ్మతి నేతలు హరిప్రియకు వ్యతిరేకంగా చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు. హరిప్రియకు కాకుండా ఇతరులకు ఎవరికిచ్చినా తాము పనిచేస్తామంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
ఒక్కటైన చైర్మన్, వైస్ చైర్మన్
మరో వైపు బీఆర్ఎస్కు చెందిన ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీపాషా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. 24 మంది కౌన్సిలర్లున్న మున్సిపాలిటీలో 19 మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. వీరిలో వైస్ చైర్మన్ వర్గానికి చెందిన 12 నుంచి 14 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే హరిప్రియకు మద్దతు ఇస్తున్నారు. శుక్రవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఇల్లెందులోని ఓ రహస్య ప్రాంతంలో మంతనాలు సాగించారు.
కొందరు పెద్దలు ఇద్దరి మధ్య రాజీకి యత్నాలు చేశారు. ఇద్దరు కలిసి పనిచేసేలా ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా చైర్మన్ వర్గం చెప్తుండగా అటువంటిదేమీ లేదని వైస్ చైర్మన్ వర్గం పేర్కొంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఒక్కటైనప్పటికీ తాము మాత్రం చైర్మన్తో కలిపి పనిచేసేది లేదంటూ కౌన్సిలర్లు చెప్తున్నారు. చైర్మన్కు వ్యతిరేకంగా ఉన్న కౌన్సిలర్లకు తాను అండగా ఉన్నానంటూ హరిప్రియ భర్త హరిసింగ్భరోసా ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే
వర్గానికి, మున్సిపల్ చైర్మన్ వర్గానికి మధ్య అగ్గి రాజుకుంటోంది.