మేకప్​ తీసేస్తే తెలుస్తుంది బడ్జెట్​ అసలు రంగు!

మేకప్​ తీసేస్తే తెలుస్తుంది బడ్జెట్​ అసలు రంగు!

గొప్పలు చెప్పుకుంటే బడాయి… తక్కువ చేసి చెప్పుకుంటే చేతకానితనం.  తమ ఆర్థిక పురోగతిని చాటిచెప్పుకునేందుకు ఏ రాష్ట్రానికైనా తమ వార్షిక బడ్జెట్​ అసలు సిసలైన బెంచ్​మార్క్​. దేశ బడ్జెట్​  నేరుగా ప్రజల జీవన ప్రమాణాలపై ఎఫెక్ట్ చూపిస్తే.. రాష్ట్ర బడ్జెట్​ ఆయా ప్రాంతాల్లోని  అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మైలురాయిగా నిలుస్తుంది. ఏ ఏటికాయేడు ఆదాయ వ్యయాల అంచనాలను ప్రకటించే ఈ బడ్జెట్ నిజంగా వాస్తవాలను ప్రతిబింబిస్తుందా.. అనేది ఆ ఏడాది పూర్తయ్యే దాకా డౌటే. ముందుగా వేసుకున్న అంచనాలను సవరించుకోవటం, నెలనెలా ఇచ్చే అకౌంట్లను దిద్దుకోవటం.. ఆడిటర్​ జనరల్​ ఆడిట్​ చేయటం.. ఇవన్నీ అయ్యాకే ఆ ఏడాదికి సంబంధించిన అసలు  ఆదాయ వ్యయాలేమిటో బట్టబయలవుతుంది. ఇదంతా జరిగేసరికి రెండేళ్లు పడుతోంది. ఉదాహరణకు ఈ ఆర్థిక సంవత్సరానికి 2020–21 ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో అంచనాలకు.. అసలు వాస్తవాలు తేలాలంటే 2023 వరకు వెయిట్​ చేయాలి. 2018–19 మన రాష్ట్ర  ప్రభుత్వం  రూ.1.74 లక్షల కోట్ల బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించి వాస్తవంగా రూ.1.57 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు అకౌంట్ల వివరాలను ఈ బడ్జెట్​లో పొందుపరిచింది. ఆడిట్​ జరిగిన తర్వాత ఇందులోనూ మార్పులు చేర్పులుండే అవకాశముంది. అప్పుడు తేలేది అసలైన లెక్కా పద్దుల చిట్టా. అదే అసలైన బడ్జెట్. సూటిగా చెప్పాలంటే సభలో ప్రవేశపెట్టేది… మేకప్​ వేసిన సినిమాస్టార్​ లాంటి బడ్జెట్​. రెండేళ్ల తర్వాత ఆ మేకప్​ తీసేస్తే కనిపించేది అసలు బడ్జెట్​.

అకౌంట్లు, ఆడిట్ లో అసలు పద్దు

సొంత పన్నుల ద్వారా వచ్చే రాబడి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లు, ఏటేటా పెరిగే  ద్రవ్యోల్బణమే అన్ని రాష్ట్రాలకు ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన పద్దులు. వీటికి తోడుగా ఆర్థిక చట్టాల  పరిమితి మేరకు తెచ్చే అప్పులు అదనం. ఇవన్నీ బ్యాలెన్స్​ చేస్తూ కలిపితేనే ఆశావహ బడ్జెట్​. అంచనాలు మోతాదు మించితే ఊహల బడ్జెటే. ఆరేళ్ల కిందట కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో ఈ బడ్జెట్​  వాస్తవ ఆదాయ వ్యయాలను ప్రతిబింబిస్తుందా..? అనేది ఆసక్తి రేపుతోంది. నిజానికి దేశమంతటా వస్తు సేవలన్నింటికీ ఒకే పన్ను విధానం జీఎస్​టీ  అమల్లోకి వచ్చాక రాష్ట్రంలోనూ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో చెప్పుకోదగ్గ మార్పులుండే అవకాశం లేదు.

లిక్కర్​, పెట్రోల్​ అమ్మకాలు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, వాహనాల ద్వారా వచ్చే ఇన్​కమ్ రాష్ట్రానికి పెద్ద దిక్కు. కానీ బడ్జెట్ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తోచిన రీతిగా తగ్గించి పెంచుతున్న తీరు కనబడుతోంది. తెలంగాణ ఏర్పడ్డ తొలి ఏడాది రూ. లక్ష కోట్లతో తొలి బడ్జెట్​ పెట్టిన సీఎం కేసీఆర్ క్రమంగా అయిదో ఏడాది నాటికి రూ.1.74 లక్షల కోట్లకు పెంచుకుంటూ పోయారు. రెండోసారి అధికారంలోకి రాగానే.. రూ.1.82 లక్షల కోట్ల ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. నిరుడు ఆర్థిక మాంద్యం ఉందని ఒక్కసారిగా రూ.1.43 లక్షల కోట్లకు తగ్గించింది. కానీ వాస్తవ ఆదాయ వ్యయాలు  మరో తీరుగా
ఉన్నట్లు ఎప్పటికప్పుడు ఆడిటర్​ జనరల్​కు అకౌంట్లలో అర్థమవుతోంది.

వాస్తవాలకు, అంచనాలకు తేడా;

రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఏడాది 2014–15లో తెలంగాణ ఆదాయం ప్రతి నెలా రూ.5000 కోట్లకు మించలేదు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లన్నీ కలిపితేనే అది సాధ్యమైంది. ఆ ఏడాదిలో దాదాపు రూ.15 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చినవే. అంటే సొంత ఆదాయం రూ. 45 వేల కోట్లకు మించలేదు. అదే 2018–19 నాటికి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం తిరుగులేని శక్తిగా  బలపడింది. ప్రతి నెలా రూ.14,500 కోట్లు వస్తాయని అంచనావేసి, రూ.13 వేల కోట్ల రాబడి వచ్చినట్లు అకౌంట్లను సమర్పించింది. నిరుడు 2019–20లో ఆర్థిక మాంద్యంతో రాబడి కాస్తా12 వేల కోట్లకు పడిపోతుందని అంచనాలేసింది. వాస్తవ గణాంకాలు రూ.11 వేల కోట్ల మేరకే నమోదయ్యాయి. అప్పటితో పోలిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులేమీ పెరగకపోయినా.. వచ్చే ఏడాది ప్రతినెలా15 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అంటే అంచనాలకు, వాస్తవాలకు పొంతనలేని తీరు కనిపిస్తోంది.

చేబదులు తెచ్చి.. ఇచ్చేద్దాం..;

అవసరముంటే చేబదులు తెచ్చుకోవటం.. అవసరం తీరాక చేబదులు తీర్చేయటం తెలియంది కాదు. కానీ..అదే చేబదులు తెచ్చి.. ఇచ్చేసినట్లు చూపించి రాష్ట్ర ఆదాయ వ్యయాలు పెరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ఏటేటా గొప్పలు చెప్పుకుంటోంది. 2018–19లో చేబదులు ( ఫ్లోటింగ్​ డెట్​) రూ.21,823 కోట్లుగా ప్రభుత్వం రెవిన్యూ రాబడిలో చూపించింది.. అదే పద్దును రెవిన్యూ వ్యయంలోనూ చూపించింది. 2017–18లో ఇదే ఫ్లోటింగ్​ డెట్​ రూ. 22,921 కోట్లుగా చూపించి, ఇచ్చేసినట్లు సర్దుబాటు చేశారు. 2016–17లో రూ.12,088 కోట్లు ఇదే చేబదులు పద్దులో  హళ్ళికి హళ్లి. సున్నకు సున్నా అన్నట్టుగా చూపించింది. వాస్తవంగా ఉన్న రాష్ట్ర ఆదాయం కాస్తా అంతమేరకి పెంచి చూపించటం, వాస్తవాన్ని దాచిపెట్టడం తప్ప మరోటి లేదని ఆర్థిక నిపుణులు పాయింటవుట్​ చేస్తున్నారు.

 

– బొల్గం శ్రీనివాస్​, స్టేట్​ బ్యూరో చీఫ్​

ప్రభుత్వానికేం బెనిఫిట్

ఆదాయ వ్యయాలను పెంచుకుంటూ పోవటం వల్ల ప్రభుత్వానికి అదనంగా వచ్చే ప్రయోజనమేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ఎన్నికలున్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని చెప్పుకునేందుకు.. భారీగా నిధుల కేటాయింపులు కనిపించేలా బడ్జెట్​ను పెంచి చూపిస్తాయనే వాదనలున్నాయి. దీంతో రాజకీయంగా ఓట్ల రూపంలో కొంత కలిసొస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలేమీ లేని టైమ్​లో తెలంగాణ ప్రభుత్వం వాస్తవ ఆదాయ వ్యయాలకు బదులు భారీ అంచనాలెందుకు వేసుకుందనేది డౌట్. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటికీ నిధులివ్వాలంటే ఏ పార్టీకైనా రాష్ట్ర బడ్జెట్​ సరిపోదని, అందుకే అంచనాలు పెంచి కేటాయింపులు చేసి.. ఖర్చు చేయకుండా దాటవేయటం పరిపాటిగా మారింది. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ఎంబీసీలకు ప్రత్యేక నిధి, ఎస్డీఎఫ్​ నిధులన్నీ ఇదే కోవలో చేరిన పద్దులుగానే కనిపిస్తాయి.

అయిదేళ్లుగా భూముల అమ్మకం

భూములు అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం అయిదేళ్లుగా ప్లాన్​ చేస్తోంది. ప్రతి ఏడాది బడ్జెట్​లో పెడుతోంది. 2015లోనే భూముల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని అంచనా వేసింది. అప్పట్నుంచీ పట్టువదలకుండానే ఈ పద్దును చూపిస్తోంది. ఈసారి  భూములు, ఆస్తులు, ఇసుక అమ్మకాల ద్వారా దాదాపు రూ.20 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని లెక్కలేయటం గమనార్హం. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ రియల్​ రంగాన్ని కుదిపేసిన తరుణంలోనూ ప్రభుత్వం మళ్లీ భూముల అమ్మకాన్ని నమ్ముకోవటం ప్రాధాన్యాంశంగానే మిగిలిపోయింది.