- తజా బడ్జెట్ లో రూ.59,632 కోట్లు అప్పే
- కిస్తీలు, మిత్తీలు కట్టేందుకే 30వేల కోట్లు
- రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై లక్ష రుణం
హైదరాబాద్, వెలుగు: ఎడాపెడా అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ కొనసాగించాలని డిసైడ్ అయింది. రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.59,632 కోట్లను అప్పుగా తెస్తామని నేరుగా ప్రస్తావించింది. 2023 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పుల మొత్తం రూ.3.44 లక్షల కోట్లకు చేరుతుందని బడ్జెట్‌లోనే సర్కారు వెల్లడించింది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే తెచ్చిన రుణాలు మరో రూ.1,35,282 కోట్లు ఉన్నాయి. అంటే వచ్చే మార్చి నాటికి ప్రభుత్వం తెచ్చిన అప్పుల మొత్తం రూ.5 లక్షల కోట్లకు చేరనుంది.
పలు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం రూ.1.35 లక్షల కోట్ల అప్పలు చేసింది. వీటిని ష్యూరిటీపై తెచ్చింది. అందుకే బడ్జెట్‌లో వీటిని నేరుగా ప్రస్తావించకుండా గ్యారంటీల పద్దులో పేర్కొంది. కార్పొరేషన్ల పేరిట తెచ్చిన అప్పులను తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంటుంది. ఇవి చాలదన్నట్లుగా ప్రభుత్వం అప్పులు తెచ్చుకునేందుకు కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూనే ఉంది. వారం రోజుల కిందటే తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఈ లెక్కన వచ్చే ఏడాది కార్పొరేషన్ల పేరిట తెచ్చే గ్యారంటీలు కూడా కలిపితే.. అప్పుల మొత్తం ఇంచుమించుగా రూ.5 లక్షల కోట్లకు చేరువ కానుంది. రూల్స్ ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్‌డీపీలో 25 శాతం మించకూడదు. లెక్కలేనన్ని గ్యారంటీలు, కొత్తగా తెస్తున్న అప్పులతో ఈ హద్దులను ప్రభుత్వం ఎప్పుడో దాటిపోయింది. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు.. ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ.70 వేల కోట్లు. గడిచిన ఎనిమిదేళ్లలో ఈ అప్పు ఏడు రెట్లు పెరిగిపోయింది.
వడ్డీలకు రూ.19 వేల కోట్లు
తెచ్చిన అప్పులకు కట్టే కిస్తీలు, మిత్తీలకే వచ్చే ఏడాది ప్రభుత్వం రూ.30,513 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన తీరు అప్పుల స్వరూపాన్ని బయటపెడుతోంది. తెచ్చిన అప్పులకు సంబంధించిన వడ్డీలకు రానున్న ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.19 వేల కోట్లు చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే చేసిన అప్పులను తీర్చేందుకు ప్రతినెలా కిస్తీల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇందుకు ప్రతినెలా పబ్లిక్ డెబ్ట్ కింద వచ్చే ఏడాదిలో రూ.8,336 కోట్లు, ఇతర లోన్స్ పేమెంట్‌కు రూ.2,897 కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్న అప్పులకు రూ.367.94 కోట్లు చెల్లించనుంది.