తెలంగాణ బడ్జెట్: లైవ్ అప్‎డేట్స్

తెలంగాణ బడ్జెట్: లైవ్ అప్‎డేట్స్

అసెంబ్లీలో  2022–2023 ఏడాదికి 2,56,958.51 కోట్ల వార్షిక బడ్జెట్ ను  ఆర్థిక మంత్రి హరీశ్‌‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్‌‌ అధ్యక్షతన అసెంబ్లీ, ప్రొటెం చైర్మన్‌‌ అధ్యక్షతన కౌన్సిల్‌‌ బిజినెస్‌‌ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించి సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై షెడ్యూల్‌‌ రూపొందిస్తారు. కనీసం పది పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ఈ బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యులను సస్పెండ్ చేశారు.

  • హైదరాబాద్ చుట్టూ అర్బన్ ఫారెస్ట్

హైదరాబాద్ నగరం చుట్టూ 66 వేల ఎకారాల్లో అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్ ప్రకటించారు.

  • ఆర్టీసీ కోసం రూ. 1500 కోట్లు 

ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా ఈ బడ్జెట్‎లో నిర్ణయం తీసుకున్నారు. అందుకు గాను బడ్జెట్‎లో రూ. 1500 కోట్లు కేటాయించడమైనది‌.

  • భ‌వ‌న నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు

భ‌వ‌న నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారు. మొద‌టి విడత‌లో ల‌క్ష మంది కార్మికుల‌కు మోటార్ సైకిళ్ల‌ను ఇవ్వాల‌ని బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించ‌డ‌మైంది.  విధివిదానాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

  • రోడ్ల కోసం రూ. 1542 కోట్లు

రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తులు, నిర్వ‌హ‌ణ కోసం 1542 కోట్ల‌ను ప్ర‌భుత్వం ఈ వార్షిక బ‌డ్జెట్‌లో కేటాయించింది.  మెట్రో రైలును పాత‌బ‌స్తీలో 5.5 కిలోమీట‌ర్ల‌కు అనుసంధానించేందుకు ఈ బ‌డ్జెట్‌లో 500  కోట్లు  కేటాయించ‌డ‌మైంది.

  • ‘కేసీఆర్‌ నూట్రీషియన్‌ కిట్‌’

బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈలోపాన్ని నివారించేందుకు, ‘కేసీఆర్‌ నూట్రీషియన్‌ కిట్‌’ పేరుతో పోషకాహారంతో కూడిన కిట్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం  ఈ బడ్జెట్ లో నిర్ణయించింది. ఈ కిట్స్‌ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.

  • గీత కార్మికుల కోసం వంద కోట్లు 

గీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేకపథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు.

  • నేతన్న కోసం రూ. 5 లక్షల బీమా

రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్ లో ప్రతిపాదించారు.

  • ఈ ఏడాది 75 వేల లోపు రుణాల‌ మాఫీకి గ్రీన్ సిగ్నల్

వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ లో నిధులు కేటాయిస్తోంది. గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్లరూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. రైతు మరణిస్తే రైతు భీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు  ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఈ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24,254 కోట్ల రూపాయలు కేటాయించారు. గ‌తంలో హామీ ఇచ్చిన‌ట్టుగా ఈ ఏడాది 75 వేల లోపు రుణాల‌ను కూడా మాఫీ చేయాల‌ని నిర్ణ‌యించారు. రూ. 50 వేల లోపు రుణం ఉంటే ఈ ఏడాది మార్చి చివరినాటికి మాఫీ కానుంది.

  • ఆస్పత్రులలో పారిశుధ్య కార్మికుల జీతాలు పెంపు

పారిశుధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు ఒక్కో బెడ్ కు అయ్యే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం 338 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది.

  • ప్రభుత్వ ఆస్పత్రులలో డైట్ చార్జీలు రెట్టింపు

ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారం కూడా అందిస్తున్నారు. ఆ డైట్ చార్జీలను డబుల్ చేస్తున్నట్లు అసెంబ్లీలో మంత్రి హరీశ్ ప్రకటించారు.  అంతేకాకుండా హైదరాబాద్ లోని మేజర్ ప్రభుత్వ ఆస్పత్రులలో పేషంట్ సహాయకులకు కూడా రెండు పూటలా భోజనం అందచేయనున్నట్లు ప్రకటించారు.

  • రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ

ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలనే ఆలోచనతో రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇందుకోసం గాను 100 కోట్ల రూపాయలు కేటాయించారు.

  • మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలు

హైదరాబాద్ లోని బస్తీ దవాఖానాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో 60 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

  • జిల్లాకో మెడికల్ కాలేజీ

రాష్ట్ర ప్రజలకు బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

  • నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంపై బడ్జెట్ లో మరో విషయం వెల్లడించారు. నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు కేటాయిస్తామని ప్రకటించారు. అదేవిధంగా సొంత జాగా ఉన్నోళ్లకు 3 లక్షల రూపాయలు అందజేస్తామని తెలిపారు.

  • అసెంబ్లీ ముందు బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

సస్పెన్ష్ కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్ ,రఘునందన్ రావులు నల్ల కండువాలతో అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

  • అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

కేంద్రంపై హరీష్ రావు కామెంట్స్ కు నిరసన బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులు నిరసనకు దిగారు. దాంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ ముగ్గురిని ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా కూడా బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో.. మార్షల్స్ ఆ ముగ్గురిని ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు.

  • రైతులపై భారం వేసేందుకు మేం సిద్ధంగా లేం

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతులపై భారం వేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి హరీశ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర చట్టానికి అనుమతించం.

  • ఐటీఐఆర్ ను కేంద్రం అమలు కానిస్తలే

ఐటీఐఆర్‎ను కేంద్రం అమలు కానిస్తలేదని మంత్రి హరీశ్ అన్నారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే 7 మండలాలను ఏపీలో కలిపారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడం లేదు. ప్రధాని దృష్టికి సీఎం ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.

  • బడ్జెట్ ప్రసంగం మొదలు

ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ ప్రారంభించారు. కేసీఆర్ పథకాలు మెచ్చిన ప్రజలు.. ఆయన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

  • సీఎం కాన్వాయ్‎ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓయూ జేఏసీ నేత

సీఎం కాన్వాయ్‎ని అడ్డుకోవడానికి ఓయూ జాక్ చెర్మన్ అర్జున్ నాయక్ ప్రయత్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం అసెంబ్లీకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  • అసెంబ్లీకి ఆర్ఆర్ఆర్: ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఈ బడ్జెట్ రాబోయే ఎన్నికల బడ్జెట్ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఇంట్లో నుంచి బయలుదేరే సమయంలోనే పోలీసులు మా వాహనాలను డైవర్ట్ చేశారు. కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గవర్నర్ స్పీచ్ తీసేయడం కేసీఆర్ రాజ్యాంగమే. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే కూడా అడ్డుకుంటున్నారు. కేసీఆర్‎కు వ్యతిరేకంగా  గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాలి. ఆర్ఆర్ఆర్ అసెంబ్లీలో అడుగు పెడుతోంది.

  • గవర్నర్‎కే మాట్లాడే హక్కు లేకపోతే.. సభ్యులకు దిక్కెంటి: ఎమ్మెల్యే ఈటల

యాభై ఏళ్ళ సాంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం దారుణం. దీనిపై చర్చించే హక్కు మాకు ఉంటుంది. శాసన సభ నియమాలు కాదని.. కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నడు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసిన కేసిఆర్‎కు.. ఆ సీట్లో ఉండటానికి అర్హత లేదు. గవర్నర్‎కే మాట్లాడే హక్కు లేకపోతే.. సభ్యులకు దిక్కెంటి. కేసీఆర్ సభ్యులను కించపరుస్తున్నారు. వచ్చే అసెంబ్లీలో ఎగిరేది బీజేపీ జెండానే. సమైక్యాంధ్రలో కూడా తెలంగాణ తరపున మాట్లాడేందుకు గంటల తరబడి సమయం ఇచ్చారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే బయట మీ సంగతి తేలుస్తాం. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో బీజేపీ పోరాటం చేస్తుంది.

  • కేసీఆర్ హిట్లర్‎ను తలపిస్తున్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్

గవర్నర్ ప్రసంగం లేకుండానే సభా ప్రారంభం కావడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కేసీఆర్ హిట్లర్‎ను తలపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ తీరును పరిశీలిస్తున్నారు. ఆయన మహిళకు కూడా గౌరవం ఇవ్వడం లేదు. నీ బలాబలాలను ఓడించి మా నేతలు గెలిచారు. తెలంగాణ ప్రజల గొంతుక వినిపించేందుకు సభను వినియోగించుకుంటాం. మమ్మల్ని సభలో మాట్లాడనివ్వకపోతే నీ గొంతు ఎక్కడ నొక్కాలో మాకు తెలుసు. మా గొంతు నొక్కుకుండా మాట్లాడే అవకాశం ఉంది. సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మీడియా సహకారంతో ప్రజలకు మా గొంతుక వినిపిస్తాం.

  • అసెంబ్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్

బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఆవరణకు చేరుకున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీలో హరీశ్ రావు, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి  బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 

  • గన్ పార్క్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు గన్ పార్క్ చేరుకున్నారు. నల్ల కండువాలు ధరించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. 

  • అభిమానులు ఈటలను కలవొద్దు

హుజురాబాద్ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి.. ఈటల రాజేందర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. దాంతో ఈటలను కలిసేందుకు హుజురాబాద్ డివిజన్ నుంచి ఆయన అభిమానులు హైదరాబాద్‎కు వచ్చారు. శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్తున్న అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల నివాసానికి వెళ్లనివ్వట్లేదని... ఆయన అభిమానులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

  • అసెంబ్లీ చుట్టు 1200 మంది పోలీసులు

అసెంబ్లీ సమావేశాల నేఫథ్యంలో సిటీలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. దాదాపు 12వందల మంది సిబ్బందితో బందోబస్తు చేస్తున్నారు. లక్డీకాపూల్ నుంచి నాంపల్లి వరకు ఎక్కడా చూసినా పోలీస్ సిబ్బందే కనిపిస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.  విద్యార్థి సంఘాలు, సమస్యలు పరిష్కారం కానీ వర్గాలు అసెంబ్లీని ముట్టడించే అవకాశం ఉండటంతో.. గన్ పార్క్ చుట్టూ పది ఫీట్ల హైట్‎లో బారీకేడ్లు పెట్టారు. ఓ ఐజీ, ఇద్దరు డీఐజీలు, నలుగురు డీసీపీల పర్యవేక్షణలో భద్రత కొనసాగుతోంది.

  • జూబ్లీహిల్స్ వెంకన్న సన్నిధికి హరీశ్ రావు

ఆర్థిక మంత్రి హరీశ్‌‌రావు సోమవారం ఉదయం 9 గంటలకు తన నివాసం నుంచి బయల్దేరి.. ఫిల్మ్‌‌నగర్‌‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అసెంబ్లీలో మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు ఆర్ధిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తాను అసెంబ్లీలో.. మంత్రి ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. ప్రజల ఆకాంక్షలు, వారికిచ్చిన హామీలకు అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందన్నారు.  మానవీయ కోణంలో బడ్జెట్‎ను రూపొందించామని తెలిపారు. అంతకు మందు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఇక్కడ నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు.