ఇక ఊళ్లోనే ఉద్యోగం.. పల్లె పరిశ్రమలకు సర్కార్ దన్ను.. రూ.1,049.5 కోట్లు కేటాయింపు

ఇక ఊళ్లోనే ఉద్యోగం.. పల్లె పరిశ్రమలకు సర్కార్ దన్ను.. రూ.1,049.5 కోట్లు కేటాయింపు
  • రూ.1,049.5 కోట్లు కేటాయించిన సర్కారు
  • పరిశ్రమల శాఖకు రూ.3,898 కోట్లు
  • చేనేత కార్మికులకు రూ.355 కోట్లు
  • స్కిల్ యూనివర్సిటీ కోసం రూ.113 కోట్లు

హైదరాబాద్, వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ), గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర సర్కార్ బడ్జెట్ కేటాయింపులను చేసింది. పల్లెల్లో ఇండస్ట్రీల అభివృద్ధి కోసం రూ.1,049.5 కోట్ల నిధులను కేటాయించింది. పల్లె చిన్న పరిశ్రమలకు కింద రూ.673 కోట్లు, హ్యాండ్లూమ్ టెక్స్​టైల్స్ కింద చిన్న పరిశ్రమలకు రూ.355 కోట్లు సహా రూ.1,049.5 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.

కామర్స్ అండ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ల కోసం రూ.2,362.24 కోట్లు కేటాయించగా.. మొత్తం ఇండస్ట్రీస్​ డిపార్ట్​మెంట్కు రూ.3,898 కోట్లను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. మరోవైపు పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీలను నెలకొల్పితే ఇచ్చే ఇన్సెంటివ్స్ కోసం రూ.580 కోట్లను అలకేట్​చేసింది. స్కిల్ యూనివర్సిటీ కోసం రూ.113.26 కోట్లు కేటాయించింది.

కరోనా సమయంలో చాలా వరకు ఎంఎస్ఎంఈలు మూత పడ్డాయి. మరికొన్ని మూతపడే దశకు చేరాయి. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా పరిశ్రమల యజమానులు ఇప్పటికే విజ్ఞప్తులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయా పరిశ్రమలను బతికించేందుకుగానూ ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయించింది. అందుకుగానూ రూ.628.86 కోట్లను కేటాయించింది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య పది ఫార్మా విలేజ్ల భూసేకరణ కోసం రూ.50 కోట్లు, మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కోసం రూ.139.03 కోట్ల కేటాయింపులు చేసింది.

నేతన్నలకు దన్నుగా..
చేనేత కార్మికులకు దన్నుగా ఉండేందుకు సర్కారు నిర్ణయించింది. వారికి ఆర్థిక సాయం కింద రూ.237.46 కోట్లు.. హ్యాండ్లూమ్ టెక్స్​టైల్ ప్రమోషన్​కు ఆర్థిక సాయం కింద రూ.102.54 కోట్లు సహా చేనేతకు మొత్తంగా రూ.355 కోట్లను కేటాయించింది. మరోవైపు ఉమ్మడి జిల్లాల్లో కొత్త ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటుకు రూ.177.02 కోట్లను బడ్జెట్​లో ప్రతిపాదించింది.