
- రూ.3.10 లక్షల కోట్ల వరకు 2025–26 పద్దు?
- సొంత రాబడి, భూముల అమ్మకంతో నాన్ ట్యాక్స్,
- ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందని అంచనాలు
- విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రయారిటీ
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, ఇతర ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయ్యింది. ఇప్పటికే 14 నెలలపాటు ఆదాయ, వ్యయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రభుత్వం.. ఆ మేరకే పద్దును పెట్టేందుకు సిద్ధమైంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఉదయం 11.02 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమర్పించనున్నారు.
ఈ మేరకు బడ్జెట్‌కు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అసెంబ్లీ లాబీల్లోని కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై.. ఆమోదం తెలుపనున్నది. రూ.3.10 లక్షల కోట్ల వరకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను పెట్టనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇంకాస్త ఎక్కువే అనుకున్నప్పటికీ ఆదాయ, వ్యయాల ప్రకారం మార్పులు చేసినట్టు తెలుస్తున్నది. ఈసారి రాష్ట్ర సొంత ఆదాయాన్ని ప్రభుత్వం ఎక్కువగా చూపనున్నది. వివిధ మార్గాల్లో వస్తున్న రాబడిని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం, గతంలో ఉన్న లూప్స్‌ను అరికట్టడంతో ఆదాయం పెరిగింది.
ఎల్ఆర్ఎస్, 58,59 జీవోల క్లియరెన్స్, ఎక్సైజ్ పాలసీ, భూముల ధరల సవరణ వంటి వాటితో ఇన్కమ్ పెరగనున్నది. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూను కూడా ఎక్కువగా అంచనా వేస్తున్నారు. ఇందుకు టీజీఐఐసీ, హెచ్ఎండీఏ భూములు తనఖా పెట్టి, వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం లోన్లు తీసుకోనున్నది. కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో రూ.35,028 కోట్లు నాన్ ట్యాక్స్ ఆదాయం పెట్టుకున్నది. అయితే, ఈసారి ఈ మొత్తం కొంత పెంచనున్నట్టు తెలుస్తున్నది. 2024–25 రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్ల కింద రూ.21,636 కోట్లు వస్తాయని ఆశించగా.. కేవలం రూ.6 వేల కోట్ల వరకే వచ్చాయి. దీంతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ఇన్ఎయిడ్ ను ఈ బడ్జెట్లో కొంతమేర తగ్గించుకోనున్నది.
విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యం
ఈ బడ్జెట్లోనూ విద్య, వైద్యంతోపాటు వ్యవసాయం, సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అదే సమయంలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెరుగనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేయనున్నట్టు తెలిసింది. ఇక వ్యవసాయంలో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, రైతు బీమా, పంటల బీమాకు రూ.7 వేల కోట్లు కేటాయించనున్నది.
ఆ తర్వాత ఎడ్యుకేషన్‌కు కూడా మంచి కేటాయింపులు ఉంటాయని తెలుస్తున్నది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు నిధులు ఇవ్వనున్నారు. ఇరిగేషన్‌కు కూడా రూ.26 వేల కోట్లకు పైనే కేటాయించనున్నది. మూసీ రివర్‌ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీకి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్టు సమాచారం.
పీఆర్సీ, డీఏలు, కొత్త ఉద్యోగాలు
పీఆర్సీ ప్రకటన, డీఏలు ఇవ్వడం, కొత్త ఉద్యోగాల రిక్రూట్మెంట్తో పాటు జీత భత్యాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీలకు అవసరమైన మేరకు కేటాయింపులు చేయనున్నారు. జీఎస్డీపీలో 3 శాతం అప్పుల రూపంలో సమకూరుతాయి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ రూ.2 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.
నాన్‌ట్యాక్స్ రెవెన్యూ కూడా రూ.35 వేల కోట్ల పైన రాబట్టుకోవాలని ప్రతిపాదనలు చేశారు. గ్రాంట్ఇన్ ఎయిడ్ కింద రూ.15 వేల–రూ. 20 వేల కోట్లు పెట్టనున్నట్టు తెలుస్తున్నది. ఇక అప్పులు రూ.60 వేల కోట్ల పైనే తీసుకోనున్నారు. ఇతరత్రా అన్నీ కలిపితే ఈ సారి బడ్జెట్ రూ.3.10 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నది.