ఇది చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్  : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

ఇది చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్  : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

నల్గొండ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ కలెక్టర్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ ప్రతిఫలాలు అందించే విధంగా బడ్జెట్​ను రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్​లో ఇరిగేషన్ కు పెద్దపీట వేశామన్నారు.

జిల్లాలో ఈసారి లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని, దీని ద్వారా దాన్యం దిగుబడి పెరిగినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ వెల్లెంలకు బడ్జెట్​లో రెండింతలు నిధులు పెంచామని చెప్పారు. కాల్వలు, ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు రూ.37 కోట్లను విడుదల చేశామన్నారు. డిసెంబర్ నాటికి లక్ష ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రూ.11 వేల కోట్లతో 58 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఒక్కొక్కటి రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

నల్గొండలో  రూ.75 కోట్లతో నిర్మించిన ఏటీసీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నూతన హైకోర్టు భవనాన్ని నిర్మిస్తామని, రూ.2700 కోట్లతో నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించనున్నట్లు వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అధికారులు పాల్గొన్నారు. 

విద్యార్థినులు ఆదర్శంగా తీసుకోవాలి..

నల్గొండ అర్బన్, వెలుగు : సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళలను విద్యార్థినులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. గురువారం నల్గొండలోని రామగిరి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రూ.కోటి నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంట్లో మహిళ చదువుకుంటే కుటుంబంతోపాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, కళాశాల ప్రిన్సిపాల్  శ్రీనివాసరాజు పాల్గొన్నారు.