
- విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం
- కిస్తీలు, వడ్డీల చెల్లింపులకు రూ.68 వేల కోట్లు
- ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునరుజ్జీవం,
- సాగు నీటి ప్రాజెక్టులకు ఫండ్స్ .. ఆరు గ్యారంటీల అమలుకు నిధులు
- ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు రూ.2,500 స్కీమ్ ప్రకటించే చాన్స్
- ఎస్సీలకు 18 శాతం నిధులు కేటాయించాలని యోచన
- పీఆర్సీ, డీఏలు, కొత్త ఉద్యోగాల భర్తీతో పెరగనున్న జీతభత్యాల లెక్క
- ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ సిద్ధం చేస్తున్నది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3.30 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. ఓవైపు పెరుగుతున్న ఖర్చులకు తగినట్టుగా ఆదాయం పెంపు.. మరోవైపు సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమమే ప్రాధాన్య అంశాలుగా అంచనాలు సిద్ధం అవుతున్నాయని పేర్కొంటున్నాయి. గతేడాది (2024–25) రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి మరో రూ.40 వేల కోట్లు పెంచనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ట్యాక్స్ ఆదాయం భారీగా పెంచడంతో పాటు నాన్ ట్యాక్స్ఆదాయంపైనా ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. తద్వారా ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలతో పాటు గేమ్ ఛేంజర్లుగా భావిస్తున్న ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్‌సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించాలని యోచిస్తున్నది. ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలకు నిధులు పెంచాల్సి ఉండడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించనున్నది. దీంతో పాటు కొత్త ఉద్యోగుల రిక్రూట్‌మెంట్ వల్ల శాలరీ బడ్జెట్ పెరగనుంది. దీనికి ఒకట్రెండు పెండింగ్ డీఏలు తోడైతే ఆ మేరకు అదనపు నిధులు కావాలి.
పైగా గతేడాదితో పోలిస్తే అప్పుల కిస్తీలు, వడ్డీల మొత్తం కూడా పెరగనుంది. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ ఈసారి భారీ బడ్జెట్‌కు అంచనాలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల గవర్నర్ ప్రసంగంలోనూ ప్రభుత్వం భారీ బడ్జెట్‌పై సంకేతాలుఇచ్చింది. ‘‘కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ, ప్రతి కేటాయింపు వెనుక మన ప్రజల ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించాలి’’ అని గవర్నర్‌తో చెప్పించడాన్ని బట్టి చూస్తే.. అసెంబ్లీలో 19న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఎలా ఉండబోతున్నదో కొంతవరకు స్పష్టత వచ్చినట్లయింది. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, పారామెడికల్కాలేజీలు, నాలుగు సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంతో పాటు కేసీఆర్కిట్స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటన్నింటికీ తగిన కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంది. ఇందుకోసం రూ.3వేల కోట్ల మేర అంచనాలు రూపొందించినట్టు తెలిసింది. ప్రాజెక్టుల నిర్వహణతో పాటు ప్రాధాన్యంగా భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకూ ఈసారి భారీగా నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. ఇందులో పాల మూరు–రంగారెడ్డితో పాటు సీతారామ లిప్ట్ఇరిగేషన్, డిండి ప్రాజెక్టులకు అంచనాలు రెడీ చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు, కాలేజీల్లోనూ మిడ్ డే మీల్స్ కల్పించేలా నిధులు ప్రతిపాదిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీకి 30 వేల ఎకరాలు సేకరించాలని ప్రభు త్వం భావిస్తున్నది. ఇప్పటికే సగం మేర భూములు ఉన్నాయి. మిగతా వాటిని సేకరించడం, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు కేటాయించనున్నట్టు తెలిసింది. ఇక ఈసారి పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జీతభత్యాలు, పెన్షన్లు పెరగనున్నాయి. దీనికి తోడు ఒకటి లేదా రెండు డీఏలు రిలీజ్ చేయనున్నట్లు చెప్తున్నారు. కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటున్నందున.. ఈ రూపంలో ప్రభుత్వంపై అదనపు భారం పడ్తుంది. ఇక అప్పులకు కిస్తీలు, వడ్డీల రూపంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.68 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ బడ్జెట్ పరిధిలోనే చెల్లిస్తున్నారు. ఇలా ఏ రకంగా చూసినా అటు జీతభత్యాలు, ఇటు కిస్తీలకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1.25 లక్షల కోట్లపైనే చెల్లించాల్సి ఉంది.
ఆదాయ అంచనాలు ఇలా..
ప్రభుత్వం రెడీ చేస్తున్న అంచనాల ప్రకారం ఇప్పుడున్న దానికి దాదాపు 15 శాతం మేర బడ్జెట్ పెరగనుంది. పోయినసారి రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీనికి 15 శాతం మేర అంటే రూ.3.30 లక్షల కోట్లు దాటుతున్నది. గత కొంత కాలంగా రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే.. ఒక్క కరోనా ఏడాది మినహా ప్రతి ఏడాది రూ.25 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల మేర పెరుగుతూ పోయింది. అయితే, గత సంవత్సరం ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ పేరుతో ఎక్కువగా పెంచలేదు. కానీ, ఈసారి రాబడి మార్గాలను అన్వేషించి.. బడ్జెట్ పెంచుతున్నది. ఇందులో ప్రధానంగా జీఎస్టీ లీకేజీలు ఆరికట్టడంతో ఆ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నది. దాని ద్వారానే రూ.68 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నది. దీంతో పాటు ఈసారి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. కొత్త వైన్స్‌లకు దరఖాస్తులు, పెరిగిన లిక్కర్ రేట్లతో దాదాపు రూ.55 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
భూముల విలువను సవరించాలని ప్రభుత్వం చూస్తు న్నది. ఈ చర్యలతో రియల్ బూమ్ వస్తుందని అనుకుంటున్నది. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల రాబడి కూడా రూ.20 వేల కోట్ల మేర ప్రతిపాదిస్తున్నారు. సేల్స్ట్యాక్స్ఇతరత్రా పన్ను ఆదాయం కాకుండా నాన్ ట్యాక్స్ రాబడిని ఇంకింత పెంచుకోవాలని ప్రభు త్వం చూస్తున్నది. ఇందులో భూముల అమ్మకాలు ఉన్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఎల్ఆర్ఎస్, 58,59 జీవోల క్రమబద్ధీకరణ, అక్రమ మైనింగ్పెనాల్టీల వసూలు వంటివి ఉన్నాయి. వీటన్నింతో రూ.60 వేల కోట్ల మేర ఆదాయం ఆశిస్తున్నది. అప్పుల రూపంలో యథావిధిగా జీఎస్‌డీపీ ప్రకారం రాష్ట్రానికి రూ.65–70 వేల కోట్ల మేర రానున్నాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలోనూ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇలా వివిధ రూపాల్లో అన్నీ కలిపి రూ.3 లక్షల కోట్లకు పైనే ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
గ్యారంటీలు.. స్కీమ్‌లు
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన స్కీములను కొత్త ఆర్ధిక సంవత్సరంలో పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం రూ.2 వేలుగా ఉన్న ఆసరా పెన్షన్లను కనీసం రూ.3 వేలకు పెంచేలా అంచనాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.3 వేల కోట్ల నుంచి 4 వేల కోట్ల అదనపు భారం పడనుంది. మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా అర్హులైన మహిళలకు రూ.2,500 ఇచ్చే స్కీమ్‌ను కూడా ఈ బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని సెక్రటేరియెట్‌లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి బడ్జెట్‌లో భారీగానే కేటాయింపులు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.14 వేల కోట్ల మేర కేటాయించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అటు గ్రామాలకు, ఇటు మున్సిపాలిటీలకూ ప్రభుత్వం నిధుల వరద పారించనున్నట్టు చర్చ జరుగుతున్నది.
ఎస్సీలకు 18% ఫండ్స్..
బడ్జెట్‌లో ఎస్సీలకు 18 శాతం నిధులు కేటాయించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం వచ్చే బడ్జెట్‌లో ఎస్సీలకు 18 శాతం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇటీవల లేఖ రాశారు. ఇందులో భాగంగానే బడ్జెట్‌లో ఎస్సీలకు రూ.54 వేల కోట్లు కేటాయించే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి.