
- అత్యధికంగా వాటర్ బోర్డుకు రూ.3,385 కోట్లు కేటాయింపు
- జీహెచ్ఎంసీకి రూ.3,101 కోట్లు
- మెట్రో రైల్కు రూ.1,100 కోట్లు
- హెచ్ఎండీఏకు రూ.700 కోట్లు
- మూసీ ప్రక్షాళనకు 1,500 కోట్లు
- హైడ్రా, కుడా, పోలీస్ కమిషనరేట్లకు సరిపడా నిధులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్తున్న ప్రభుత్వం 2025–26 బడ్జెట్లో జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్ఎండీఏ, మెట్రో రైల్ వంటి శాఖలకు దాదాపు రూ.10 వేల కోట్లు కేటాయించింది. వార్షిక బడ్జెట్ కోసం ఆయా డిపార్ట్మెంట్లు ప్రతిపాదనలు పంపగా, అభివృద్ధే ధ్యేయంగా కేటాయింపులు చేసింది. కేటాయింపులపై హెచ్ఎండీఏ నిరాశ చెందగా, ఈ ఏడాది భూములను తనఖా పెట్టి రూ.20 వేల కోట్లను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. అందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ఇచ్చింది.
జీహెచ్ఎంసీకి ఆశాజనక కేటాయింపులు
ఈసారి రూ.7,208 కోట్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం రూ. 3,101.21 కోట్లు కేటాయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో బల్దియాను అసలు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు కోసం బల్దియా అప్పులు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ లో రూ.3,065 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.1,600 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేయగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.411 కోట్లు మరో వారంలో రానున్నాయి.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్ ఫర్మేటివ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ (హెచ్ సిటీ) కోసం రూ.2,654 కోట్లు కేటాయించింది. హెచ్ సిటీలో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కేబీఆర్ పార్కు దగ్గర పనులు స్పీడప్ చేయడానికి ఈ కేటాయింపులు ఉపయోగపడున్నాయి. దీంతో పాటు మిలియన్ ప్లస్ సిటీలకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూ.419 కోట్లు, ప్రొఫెషన్ ట్యాక్స్ కింద రూ.10 కోట్లు, భూసేకరణకు రూ.18.11 కోట్లు మోటార్ వెహికిల్ కాంపెన్సేషన్ కింద రూ.10 లక్షలు కేటాయించింది.
2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు బీఆర్ఎస్ రూ.11,029.34 కోట్లు కేటాయించగా, కేవలం రూ.329.46 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. బడ్జెట్లో నగరానికి మరోసారి పెద్ద పీఠ వేసినందుకు సీఎం, డిప్యూటీ సీఎంలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
హైడ్రాకు తగ్గింది.. కుడాకు కూడా అంతే..
హైడ్రాకు బడ్జెట్లో రూ.121.68 కోట్లను కేటాయించింది. గతేడాది బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించగా, రెండు దఫాలుగా రూ.100 కోట్లు విడుదల చేసింది. అలాగే, పాతబస్తీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (కుడా)కి రూ. 63.37 కోట్లు కేటాయించింది.
హైదరాబాద్కు కోత.. రాచకొండకు డబుల్
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్లో రూ. 2,55.95 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్ కమిషనరేట్‌కు నిధులు తగ్గించింది. కిందటేడు రూ.276.44 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.219.95 కోట్లకు తగ్గించింది.
సైబరాబాద్కు గతేడాది లాగే రూ.20 కోట్లు కేటాయించింది. రాచకొండకు ఈసారి ఎక్కువ అలాట్ చేసింది. గతేడాది రూ.9.40 కోట్లు కేటాయించి, తర్వాత రూ.7.28 కోట్లకు సవరించగా, ఈసారి రూ.8.72 కోట్లు పెంచి మొత్తం రూ.16 కోట్లు కేటాయించింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీజీ ఐసీసీసీ)కి ఈసారి ప్రత్యేకంగా రూ.60 కోట్లు అలాట్ చేసింది.
హెచ్ఎండీఏకు అంతంతే..
భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్లాన్లు రూపొందించిన హెచ్ఎండీఏకు ఈసారి బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు జరగలేదు. ఓఆర్ఆర్లోన్ల చెల్లింపులకు రూ.200 కోట్లు, డెవలప్మెంట్కు రూ.500 కోట్లు కలిపి రూ. 700 కోట్లను మాత్రమే కేటాయించింది. హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టులకు రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని భావించిన సంస్థ బ్యాంకర్ల కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది.
వీటి కోసం సొంత భూములనే గ్యారంటీగా పెట్టుకోవాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం కూడా నిధుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. గత ఏడాది బడ్జెట్లోనూ హెచ్ఎండీఏకే రూ.700 కోట్లనే కేటాయించగా రూ. 200 కోట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ పదేండ్లలో ఒక్క రూపాయి కేటాయించకపోగా, సంస్థకు సంబంధించిన భూములు అమ్మి ఇక్కడి నిధులనే మళ్లించుకుందన్న ఆరోపణలున్నాయి.
వాటర్ బోర్డుకు నిధుల వరద
గ్రేటర్లో తాగునీరు, మురుగునీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వాటర్‌బోర్డుకు రూ.3,385 కోట్లు కేటాయించింది. గ్రేటర్ పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఓఆర్ఆర్వరకూ వాటర్‌బోర్డు విస్తరించింది. ఈ సంవత్సరం గోదావరి ఫేజ్-2,3 పనులు కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బోర్డు రూ.5వేల కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపగా సర్కారు 3385 కోట్లు కేటాయించింది.
ఇందులో తాగునీటి సరఫరా, ఇతర అభివృద్ధి పనులకు రూ.1450 కోట్లు, గత ఏడాది కుప్పకూలిన సుంకిశాల ప్రాజెక్టు పనుల కోసం రూ.1,000 కోట్లు, బోర్డుకు చెల్లించాల్సిన లోన్లు, ఇతర పనులకు రూ. 635 కోట్లు, ఫ్రీ డ్రింకింగ్వాటర్స్కీం రీయింబర్స్‌మెంట్‌కోసం రూ. 300 కోట్లు ఇచ్చింది. గోదావరి ప్రాజెక్టుకు అవసరమైన రూ.5,563 కోట్లను ఏ విధంగా సమకూర్చుతుందో తెలియజేయలేదు. గత ఏడాది కూడా రూ.5 వేల కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపగా రూ.3385 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 3వేల కోట్లను ఇచ్చింది.
మూసీ ప్రక్షాళనకు 1,500 కోట్లు
మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కారు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్లు కేటాయించింది. అలాగే ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయల కల్పనకు రూ.100 కోట్లు ఇచ్చింది. ఇటీవలే ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, త్వరలోనే ఐఏఎస్అధికారిని కూడా నియమించనున్నారు.
మెట్రోకు కిందటేడు ‘లెక్క’నే..
మెట్రో రైల్కు ప్రభుత్వం గత ఏడాది లెక్కనే రూ.1,100 కోట్లు కేటాయించింది. ఓల్డ్ సీటీ మెట్రోకు రూ.500 కోట్లు, హెచ్ఎంఆర్ఎల్కు రూ. 500 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రోకు రూ.100 కోట్లు ఇచ్చింది. ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగా, అవి ఆమోదం పొందితే, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని మెట్రో అధికారులు చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు భరించనుండగా, మిగతావి కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల నుంచి సేకరించనున్నారు.
కేటాయింపులు మరింత పెరగాలి
గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడంలో, రిలీజ్ చేయడంలో బెటర్గా ఉంది. కేటాయింపులు మరింత పెంచాలి. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు కేటాయించి వందల కోట్లు కూడా రిలీజ్ చేయలేదు. కాంగ్రెస్సర్కార్వచ్చాక 50 శాతానికి పైగా నిధులు రిలీజ్ అయ్యాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, మెట్రో రైల్ కు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలి.
పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్