తెలంగాణ బడ్జెట్ అభూత కల్పన

తెలంగాణ బడ్జెట్ అభూత కల్పన
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అభూతకల్పన, అంకెల గారడీ, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప ఏమి లేదని కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్  ప్రభుత్వం విస్మరించిందని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఏటా రైతులకు సీజన్  ముందు ఇవ్వాల్సిన పంట పెట్టుబడి సాయానికి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. 

ఆసరా పెన్షన్ల  ప్రస్తావనే లేదని, పెన్షన్లు పెంచుతామని మోసం చేశారని ఫైర్  అయ్యారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇచ్చిన హామీ ఊసే లేదన్నారు. ‘‘దళిత సంక్షేమం కేటాయింపులను రూ.21,072 కోట్ల నుంచి  రూ.7,638 కోట్లకు, గిరిజన సంక్షేమం కేటాయింపులను రూ.4,365 కోట్ల నుంచి రూ. 3,969 కోట్లకు తగ్గించారు. ముస్లింలకు మాత్రం   2023–-24లో రూ.2 వేలుగా ఉన్న సంక్షేమ నిధులను ఏకంగా రూ.3,003 కోట్లకు పెంచారు. అంటే, ఒక్క ఏడాదిలోనే 30 శాతం పెంచారు. 

కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని చెప్పినా... దాని ఊసే లేదు. విద్యానిధి పథకం కింద రూ.5 లక్షల సాయం చేస్తామన్న హామీని సైతం విస్మరించారు” అని కిషన్  రెడ్డి పేర్కొన్నారు. ఇక ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల అంశాన్ని బడ్జెట్​లో ప్రస్తావించలేదన్నారు. విద్యా వ్యవస్థను బాగు చేయడానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా..7 శాతం నిధులే కేటాయించారని మండిపడ్డారు. ఆదాయం పెంచే మార్గాలేమిటో చెప్పలేదన్నారు.