Telangana Budget: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్లో కీలక ప్రకటన

Telangana Budget: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్లో కీలక ప్రకటన

హైదరాబాద్: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్లో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పౌర సరఫరాల శాఖకు ఈ బడ్జెట్లో 5 వేల 734 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రేషన్ కార్డుల జారీ, అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియను జనవరి 26 నుంచి ప్రారంభించామని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తుచేశారు.

రేషన్‌‌‌‌ కార్డుల్లో కొత్త పేర్ల నమోదు, తప్పులు సరిదిద్దుకోవడం, కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కుటుంబ సభ్యులందరి ఆధార్‌‌‌‌ కార్డులు, ఇంటి కరెంట్​బిల్లు తప్పనిసరిగా జత చేయాలి. ఇప్పటికే రేషన్‌‌‌‌ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు జత పరచాలనుకుంటే వారి ఆధార్‌‌‌‌ కార్డు పెట్టాల్సి ఉంటుందన్నారు. ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లయ్​చేయాల్సిన అవసరం లేదు. రేషన్‌‌‌‌ కార్డు దరఖాస్తు కోసం ప్రభుత్వం రూ.50 ఫీజుగా నిర్ణయించింది. అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కోరింది.

Also Read:-ఫ్యూచర్ సిటీలో.. 200 ఎకరాల్లో AI సిటీ : బడ్జెట్ లో రూ.774 కోట్లు..

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా ద్వారా ఇప్పటివరకు 1.50 లక్షల అప్లికేషన్లు అందినట్లు సివిల్​సప్లయ్స్​అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే లక్ష వరకు అప్లికేషన్లు వచ్చాయని, మరో లక్ష వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కులగణన సర్వే, మీ సేవా కేంద్రాలతో పాటు గతంలో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కలిపి దాదాపు 10లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తున్నది. దీనికి తోడు కుటుంబసభ్యుల మార్పుచేర్పుల కోసం 20 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటికే చాలా వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్‌‌‌‌తో పాటు గ్రామ సభల ఆమోదం వంటి ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి, దశలవారీగా స్మార్ట్​రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రంలో90 లక్షలకు పైగా ఉన్న పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి.. అందరికీ స్మార్ట్​రేషన్​కార్డులు అందజేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దానికి ప్రత్యేకమైన గడువంటూ ఏమీ లేదని సివిల్​సప్లయ్స్​అధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్డుపై ఎవరి ఫొటోలు ఉండవని, కేవలం యూనిక్​నెంబర్‌‌‌‌‌‌‌‌తోనే స్మార్ట్​రేషన్ కార్డు ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.

ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్‌‌‌‌తో ఉండే ఈ కార్డును స్వైప్ చేస్తే లబ్ధిదారుల పేర్లు, ఆధార్​నెంబర్లు, అడ్రస్, రేషన్ దుకాణం వివరాలు వచ్చేలా కార్డును రూపొందిస్తున్నట్టు సివిల్ సప్లయ్స్​కమిషనర్​డీఎస్​చౌహాన్​తెలిపారు. యూనిక్​ నెంబర్ ఎంటర్ చేసినా, కార్డును స్వైప్ చేసినా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్‌‌‌‌లో వివరాలు వచ్చేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఈ స్మార్ట్​కార్డుతో ఎక్కడైనా రేషన్​ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.