పీపీపీ రోడ్లపై ఏడుగురితో కమిటీ: వచ్చే కేబినెట్ సమావేశం లోపు రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశం

పీపీపీ రోడ్లపై ఏడుగురితో కమిటీ: వచ్చే కేబినెట్ సమావేశం లోపు రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్ధతిలో డెవలప్ చేసే అంశాన్ని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు చైర్మన్‌‌గా, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ మెంబర్లుగా, ట్రైబల్‌‌ సెక్రటరీ శరత్‌‌, ఆర్ అండ్ బీ రోడ్స్ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ , పంచాయతీ రాజ్ ఈఎన్సీ కనకరత్నం, ట్రైబల్ చీఫ్ ఇంజినీర్ శంకర్‌‌ మొత్తం ఏడుగురితో కమిటీ ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ పరిధిలో గ్రామం నుంచి మండల కేంద్రం వరకు, మండలం నుంచి జిల్లా కేంద్రం వరకు అక్కడి నుంచి రాష్ట్ర రాజధాని వరకు రోడ్లను పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయడంపై ఈ కమిటీ చర్చించనుంది. ఈ నెల 30న ఈ కమిటీ తొలి బేటీ కానుంది. ఇందులో కన్సెల్టెంట్‌‌ను నియమించి, అధ్యయన బాధ్యతలు అప్పగించనున్నారు. వచ్చే కేబినెట్ మీటింగ్‌లోగా రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్‌‌ ఆదేశించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. 

రాష్ట్రంలో గ్రామాల నుంచి మండలాల వరకు 10 వేల కిలోమీటర్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రం వరకు 1,120 కిలోమీటర్లు, జిల్లా కేంద్రం నుంచి రాజధాని హైదరాబాద్‌‌ వరకు 400 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. వీటి డెవలప్‌‌కు నిధులెన్ని ఖర్చు అవుతాయి.. అప్పులు తెస్తే వాటిని ఎలా తీర్చాలి, డెవలప్ చేసిన రోడ్ల నుంచి భవిష్యత్‌‌లో నిధులను తిరిగి రాబట్టుకోవాలన్న అంశాలపై రిపోర్ట్ ఇవ్వనుందని అధికారులు చెబుతున్నారు. 

హైబ్రీడ్ యాన్యుటీ మోడల్(హామ్) పద్ధతిలో ఈ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా, 60% నిధులు కాంట్రాక్టు సంస్థ భరించనుంది. కాంట్రాక్టర్‌‌‌‌కు లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే అవకాశం ఈ హామ్ మోడల్‌‌లో ఉందని అధికారులు అంటున్నారు.