- జైలుకు వెళ్లొచ్చాక పాదయాత్ర చేస్తరో.. మోకాళ్లతో నడుస్తరో వాళ్ల ఇష్టం
- మాది తుస్సు బాంబే అయితే అర్ధరాత్రి ఢిల్లీకి వెళ్లి ప్రదక్షిణాలు ఎందుకు చేశారు?
- కాపాడండి బాబూ అంటూ అక్కడ ఎందుకు తిరిగారని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: ఫార్మూలా ఈ–రేస్ కేసులో జరిగి న దోపిడీపై రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. ఫార్ములా ఈ రేస్‌ను స్వలాభం కోసం చేశారని.. దానిపైనే కేబినెట్లో క్షుణ్ణంగా చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌పై గతంలోనే గవర్నర్ పర్మిషన్ కోసం లేఖ రాసిందని.. దీనిపై గవర్నర్ న్యాయ సలహా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి క్లియరెన్స్ ఇచ్చారని ఆయన అన్నారు.
ఏసీబీ ఇప్పటికే కేసు రిజిస్టర్ చేసిందని.. గవర్నర్ నుంచి వచ్చిన రిప్లై సీఎస్ నుంచి ఏసీబీకి వెళ్తుందని చెప్పారు. ‘‘కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేది చట్టం పరిధిలోకి పోయిన తరువాత.. చట్ట పరిధిలో జరగాల్సింది జరుగుతుంది” అని ఆయన అన్నారు. చట్టరీత్యా గవర్నర్ పర్మిషన్ అవసరం ఉందనే గవర్నర్‌కు లేఖ రాసి అనుమతి తీసుకున్నట్లు వివరించారు. గవర్నర్ కూడా లీగల్ ఓపినియ్ తీసుకోవడానికి టైం పట్టిందని, అందులో భాగంగానే కొంత లేట్ అయిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులతో కేబినెట్లో చర్చించి.. గవర్నర్ పంపిన లేఖను ప్రభుత్వం తరపున సీఎస్ నుంచి ఏసీబీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
కక్షపూరితంగా చేయట్లేదు
ఎవరినో అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందనే మాటలు అహంకారపూరితమైనవని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ‘‘పొలిటికల్ బాంబ్ అంటే నిజంగా బాంబ్‌లు పేలడం కాదు.. ఏ టైంకు ఏది జరగాలో అది జరుగుతూ వస్తుంది. మాది తుస్సు బాంబు అయితే సదరు వ్యక్తి అభద్రతతో ఎందుకు ఉండాలి? అర్ధరాత్రి ఢిల్లీకి వెళ్లి ప్రదక్షిణాలు చేసి వచ్చుడు ఎందుకు? కాపాడు బాబూ.. అని ఢిల్లీలో ఎందుకు ప్రదక్షిణ చేశారు?” అని కేటీఆర్‌ను నిలదీశారు.
ALSO READ : ఫార్ములా ఈ - రేసులో కేటీఆర్‌పై ఎంక్వైరీ
‘‘ఫార్ములా ఈ రేస్‌తో పెట్టుబడులు వచ్చాయంటున్నారు.. వస్తే ఎక్కడ దాచారో, ఏ లాకర్లో ఉన్నాయో, ఏ అకౌంట్లో ఉన్నాయో.. రూ.700 కోట్లా.. రూ.7 వేల కోట్లా ? రూ.7 లక్షల కోట్లా ? అనేది ఏసీబీ ముందు తేలుతుంది. పెట్టుబడులు వస్తే షెడ్లు ఎక్కడ వేశారో చూపించాలి. తెలంగాణలో పేదోడి సొమ్ము .. పేదోడికి చెందేలా చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడ కక్షపూరితంగా ఎవరిని .. ఏ వ్యక్తినీ ఏదీ చేయం. అంతా చట్టప్రకారమే నడుస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్షం గూండాల్లా వ్యవరిస్తున్నది
ప్రతిపక్షం ఉంటే అసెంబ్లీ చర్చలో పాల్గొనాలని.. ప్రజల మెప్పు పొందాలని మంత్రి పొంగులేటి అన్నారు. ‘‘వెల్‌లోకి దూసుకొచ్చి.. ప్లకార్డులు పట్టుకొచ్చి.. ఆ మాట్లాడే విధానం చూస్తే.. ఏదో గూండాల్లా ప్రవర్తిస్తున్నారు తప్ప.. సభలో సహచర సభ్యుల్లా ఉండటం లేదు. డిబెట్ చేయాలనుకుంటే ఎన్ని గంటలైనా చేయాలి. అది చేయలేకనే ఇలా గొడవలు చేస్తున్నారు” అని మండిపడ్డారు. సభను ఇన్ని రోజులే జరుపుతామని అనలేదని.. అదీ స్పీకర్ నిర్ణయమని ఆయన చెప్పారు. పదేండ్లు పాలించినప్పుడు ఎన్ని రోజులు అసెంబ్లీ జరిపారని బీఆర్ఎస్ను ఆయన ప్రశ్నించారు.
పాదయాత్ర చేస్తడో.. మోకాళ్లతో నడుస్తడో కేటీఆర్ ఇష్టం
జైలుకి వెళ్లొచ్చాక పాదయాత్ర చేస్తానని కేటీఆర్ అంటున్నారని మీడియా అడగగా.. ‘‘కేటీఆర్ పాదయాత్ర చేస్తరా ? మోకాళ్లతో నడుస్తరా ? పొర్లు దండాలతో ప్రదక్షిణాలు చేస్తరా అనేది వాళ్ల ఇష్టం. ఆ స్వేచ్ఛ వాళ్లకుంది” అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్‌పై టైం వచ్చినప్పుడు వివరాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ చట్టాన్ని పెట్టబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఏ రికార్డును కూడా తమ ప్రభుత్వం ట్యాంపర్ చేయదని అన్నారు. ‘‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు.. రాజ్యాన్ని రాజులా పరిపాలించిన నాడు ఏవైతే తప్పులు చేశారో ఈ ప్రజాప్రభుత్వం వాటిని గమనించి, ఆ తప్పులను బయటకు తీసి ఏదైతే మేజర్ కరప్షన్ జరిగిందని అనుకుంటున్నామో వాటినే ఎంక్వైరీ చేయిస్తున్నది” అని తెలిపారు. అర్వింద్ కుమార్ ఎంక్వైరీ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. అలా కాకుంటే పర్మిషన్ ఇన్ని రోజులు డీలే ఎందుకు చేశారని ప్రశ్నించారు. ‘‘స్వదేశానికి సంబంధించిన డబ్బులు.. విదేశానికి వెళ్లినప్పుడు ఏ పర్మిషన్తో వెళ్లాయి ? ఆ పోయిన డబ్బు ఎక్కడి పోయిందనేది విచారణలో తేలుతుంది. ఫార్ములా ఈ –రేస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ అనేది మా చేతుల్లో లేదు. ఇప్పటికైతే ఏసీబీ దగ్గర ఉంది. తర్వాత ఏమైతదో చుద్దాం” అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.