కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. నలుగురు లేదా ఐదుగురికి చాన్స్!

కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. నలుగురు లేదా ఐదుగురికి చాన్స్!
  • ముహూర్తం ఏప్రిల్ 3 ? కేబినెట్లో నలుగురు లేదా ఐదుగురికి చాన్స్!
  • ఎస్సీ కోటా నుంచి రేసులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి?
  • రెడ్డి సామాజిక వర్గం నుంచి బరిలో ఇద్దరు
  • పరిశీలనలో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు
  • బీసీ కోటా నుంచి ఇద్దరికి అవకాశం
  • విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్కు కేబినెట్లో బెర్త్ ?
  • ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి చాన్స్
  • ఆరో మంత్రి పదవిపై కొనసాగుతున్న కసరత్తు
  • ముస్లింలకా..? బంజారాలకు కేటాయిస్తారా ?

హైదరాబాద్/ఢిల్లీ: రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. వచ్చే నెల 3వ తేదీన నలుగురు లేదా ఐదుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఎవరెవరికి కేబినెట్ లో చోటు కల్పించాలన్న అంశంపై ఏఐసీసీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక  ప్రకటన వెలువడాల్సి ఉంది. సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేస్తూ కొత్త మంత్రుల ఎంపికపై ఢిల్లీలో  కసరత్తు  జరుగుతోందని సమాచారం. బీసీలకు  రెండు, ఎస్సీలకు ఒకటి, రెడ్డీలకు రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే విధంగా ఆరో మంత్రి పదవిపైనా చర్చ జరుగుతోందని సమాచారం. దానిని బంజారాలకు కేటాయించాలా..? ముస్లింలకా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ  ప్రస్తుతం నాలుగు లేదా ఐదు మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేస్తారని సమాచారం.  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి దాదాపుగా మంత్రి పదవి ఖరారైపోయిందనే ప్రచారం ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరూ మంత్రి వర్గంలో లేరు. దీంతో ఆయనకు కేటాయించే అవకాశం ఉంది.

రెడ్డి సామాజిక వర్గానికి ఈ సారి రెండు మంత్రి పదవులు దక్కుతాయనే  ప్రచారం ఉంది. రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ముఖ్యంగా తాను హోంశాఖను కోరుకుంటున్నట్టు పదే పదే మీడియా వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఆయనకు బెర్త్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రులుగా ఎవరూ లేరు. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి చాన్స్ వస్తుందనే ప్రచారం ఉంది.

గతంలో  వైద్యవిద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలే కులగణన పూర్తి చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సామాజిక వర్గానిక పెద్దపీట వేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ఈ సారి రెండు మంత్రి పదవులను బీసీలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

బీసీల్లో ఎక్కువ జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ఈ సారి పెద్దపీట వేయనుంది. ఆ సామాజికవర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి  పదవి దాదాపుగా ఖరారై పోయిందనే చర్చ ఉంది. ప్రస్తుతం విప్ గా కొనసాగుతున్న వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ఆ పదవి నుంచి తప్పించి మంత్రి పదవిని కేటాయిస్తారని తెలుస్తోంది.

ఆరో మంత్రి పదవి ఎవరికి ?
ప్రస్తుతం కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అందులో నాలుగైదు పోస్టులను బీసీ, ఎస్సీ, రెడ్డీలకు కేటాయించేందుకు ఏఐసీసీ కసరత్తు పూర్తి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆరో మంత్రి పదవిని బంజారాలకు కేటాయిస్తారా..? లేదా ముస్లింలకు ఇస్తారా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో ప్రస్తుతం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు లేరు. ఇటీవలే  పాత్రికేయుడు అమీర్‌ అలీఖాన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

ఒక వేళ ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ఆయనకే అవకాశం ఉంటుంది. అయితే ఎస్టీల్లో ప్రస్తుతం ఆదివాసీ కమ్యూనిటీకి చెందిన సీతక్క  పంచాయతీరాజ్ మంత్రిగా కొనసాగుతున్నారు. బంజారాలకు ఇవ్వాలని భావిస్తే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు గాను డోర్నకల్ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆరో మంత్రి భర్తీ ఇప్పుడు ఉంటుందా..? లేదా..? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.