అసెంబ్లీ సెషన్ తర్వాత కేబినెట్ విస్తరణ

అసెంబ్లీ సెషన్ తర్వాత కేబినెట్ విస్తరణ
  • పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా..  
  • ఇప్పటికే కసరత్తుమొదలుపెట్టిన హైకమాండ్ 
  • అన్నీ అనుకూలిస్తే ఉగాదికిముందే పూర్తి 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు ముగియగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని రాష్ట్ర నేతలకు హైకమాండ్ సంకేతాలు పంపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టింది. పార్టీ స్టేట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నది. 

సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్​సహా నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నది. కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇవన్నీ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, పార్టీ స్టేట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ మారడంతో ఆగిపోయాయి. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణ కూడా చేపట్టలేకపోతున్నారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. 

మరోవైపు పదవుల భర్తీ ఆగిపోవడంతో సొంత పార్టీలోనూ అసంతృప్తులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని భావిస్తున్న హైకమాండ్.. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే పదవుల భర్తీకి ముహూర్తం పెట్టినట్టు గాంధీభవన్​ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అన్నీ అనుకూలిస్తే ఉగాదికి ముందే అన్ని పదవుల భర్తీకి మోక్షం లభిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. 

పీసీసీ కార్యవర్గం కొలిక్కి.. 

ఇప్పటికే పీసీసీ కార్యవర్గం కసరత్తు పూర్తి కావొచ్చింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, దాదాపు 20 మంది ఉపాధ్యక్షులతో కార్యవర్గం ఏర్పాటుకు జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. ఇక మిగిలిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులపైనా క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. పార్టీలో కనీసం పదేండ్ల సీనియారిటీ ప్రాతిపదికన ఈ నియామకాలు  చేస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీ, సివిల్ సప్లయ్​వంటి కీలక కార్పొరేషన్ల చైర్మన్ పదవులకు ఎమ్మెల్యేల పేర్లను పరిశీలిస్తున్నట్టు పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.  

ఆరింటిలో నాలుగు భర్తీ.. 

పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటే కేబినెట్ విస్తరణ చేపట్టాలని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టకూడదని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్టు పీసీసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కేబినెట్‌‌‌‌‌‌‌‌లో ఆరు ఖాళీలు ఉండగా, నాలుగు భర్తీ చేయనున్నారని ప్రచారం సాగుతున్నది. 

మిగతా రెండు తర్వాత భర్తీ చేస్తారని తెలుస్తున్నది. ఈ నాలుగింటిలో మూడింటిని ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు కేటాయిస్తారని.. నాలుగోది మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ ఉమ్మడి జిల్లాకు దక్కుతుందని సంకేతాలు అందాయి. 

ఉమ్మడి నల్గొండ జిల్లాకు కూడా మరో మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. సామాజిక సమీకరణలతో పాటు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు కలిపి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తే 6 మంత్రి పదవులనూ భర్తీ చేసే అవకాశం ఉందని తెలిసింది. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.