కొత్త ఏడాది కానుకగా తెలంగాణ ప్రభుత్వం పలు హామీల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగా 2025 జనవరి 4న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సెక్రటేరియట్ లో సాయంత్రం 4 గంటలకు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
కేబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, బీసీ రిజర్వేషన్ లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం మొదలైన అంశాలపై చర్చించనున్నారు.
ఇప్పటికే రైతు భరోసా, భూభారతి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అసెంబ్లీలో చర్చించిన విషయం తెలిసిందే. సంక్రాతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇటీవల ఉపముఖ్యంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కేబినెట్ భేటీ జరిగింది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూభారతి, నిరుపేదలకు 12 వేల ఆర్థిక సాయం తదితర అంశాలపై ఉపసంఘం సమావేశంలో చర్చించారు.
మంత్రి వర్గ ఉపసంఘంలో చర్చించిన అంశాలను కేబినెట్ కు సిఫారసు చేశారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సబ్ కేబినెట్ లో చర్చించిన అంశాలను అభిప్రాయాలను జనవరి 4న జరగబోయే కేబినెట్ పరిగణనలోకి తీసుకోనుంది. ఉపసంఘం సిఫారసుల ఆదారంగా చర్చించి ఈ అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పేందుకు మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. జనవరి నాలుగున రాష్ట్ర ప్రజలకు దీనిపై స్పష్టమైన ప్రకటన జారీ చేయనుంది ప్రభుత్వం.