
- కేబినెట్ మీటింగ్‌లో సుదీర్ఘ చర్చ
- అధికారులు లేకుండా గంటన్నర సమావేశం
- 12 నుంచి అసెంబ్లీ సెషన్, ఉగాది నుంచి భూభారతి చట్టం అమల్లోకి తేవాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరు, ఏపీ జల దోపిడీ తదితర అంశాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించారు. దాదాపు గంటన్నర పాటు అధికారులు లేకుండా సమావేశంలో వీటిపై చర్చించినట్టు తెలిసింది. ప్రధానంగా ఇటీవల జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకు ఓడిపోయామని అందరి మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడటం, సిట్టింగ్ స్థానమైన కరీంనగర్గ్రాడ్యుయేట్సీటులోనూ ఓడిపోవడంపై కేబినెట్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ఏర్పడిన 14 నెలలకు జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని.. ఓటమి గల కారణాలను విశ్లేషించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను- మంత్రులు------దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తీసుకున్నట్టు తెలిసింది.
డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం..
ప్రభుత్వ పనితీరుపై బయట జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నా ఎక్కడ లోపం జరుగుతున్నదని.. ప్రభుత్వ నిర్ణయాలను మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందనే అభిప్రాయానికి వచ్చారు. రైతు భరోసా నిధులు జమ చేయకపోవడం, రేషన్‌కార్డులు వంటివి సమస్యగా మారాయని.. ఫైనాన్స్ నుంచి నిధుల కొరత వేధిస్తున్నదని కొందరు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. వీటితో పాటు ఏపీ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాలను దోచుకునేందుకు తెస్తున్న కొత్త ప్రాజెక్టులపైనా చర్చించారు.
దేశవ్యాప్తంగా పార్లమెంట్నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నందున.. జనాభా ప్రాతిపదికన కాకుండా దేశమంతా ఒకేలా ఉండే విధానం తీసుకురావాలని మంత్రలంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సి ఉంటుందని.. రాష్ట్రం నుంచి అన్ని పొలిటికల్పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ముందుకు వెళ్లాలని డిసైడ్అయ్యారు. ఇదిలా ఉండగా ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. రిజర్వేషన్ల బిల్లులను పెట్టడంతో పాటు బడ్జెట్‌కు ఆమోదం తీసుకోవాల్సి ఉన్నందున ఈ నెలఖారు వరకు సమావేశాలు జరపనున్నారు. భూభారతి రూల్స్కూడా రెడీ అవుతున్నాయని, ఉగాది నుంచి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది.