జనవరి 4న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 18 అంశాలతో కేబినెట్ అజెండా ఉన్నట్టు సమాచారం. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున... కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. అలాగే భూమి లేని పేద రైతు కూలీలకు ఏటా 2 విడతల్లో ఇచ్చే 12 వేల రూపాయల సాయానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. కూలీలకు 12 వేల సాయానికి సంబంధించి విధివిధానాలపై చర్చించనున్నారు.
ఫిబ్రవరి లేదా ఉగాది నుంచి ఫ్రీగా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో కేబినెట్ లో కొత్త రేషన్ కార్డుల జారీపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనే దానిపైనా డెసిషన్ తీసుకుంటారని తెలిసింది. SC వర్గీకరణ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపైనా చర్చించనున్నారు.
యాదగిరిగుట్ట దేవాలయానికి TTD తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసే చాన్స్ ఉంది.