హైదరాబాద్, వెలుగు: ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించి.. ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేయడం సాధారణమే అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతోనే ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించారని తెలిపారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటనలో స్పందించారు.
రొటీన్ ప్రాసెస్ లో భాగంగానే అధికారులు సోదాలు చేశారని అన్నారు. ఫాంహౌస్‌లో ఈవెంట్‌కు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని చెప్పారు. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరిగినట్లు అధికారులు గుర్తించారని వెల్లడించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (విదేశీ మద్యం)ను ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంపోర్టెడ్ లిక్కర్ కు డ్యూటీ ఫ్రీ బిల్లులు చూపించలేదని పేర్కొన్నారు.