జీవో 317 అప్లికేషన్లపై పూర్తి సమాచారం ఇవ్వండి

  • అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం
  • గడువు కోరిన ఆఫీసర్లు!

హైదరాబాద్, వెలుగు: జీవో 317 అప్లికేషన్లపై వివిధ శాఖల అధికారులు పూర్తి సమాచారాన్ని వెంటనే అందజేయాలని కేబినెట్  సబ్  కమిటీ ఆదేశించింది.  సోమవారం సెక్రటేరియెట్ లో మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్...  తొమ్మిది శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ జీవోలో భాగంగా సుమారు 52 వేల మంది ఉద్యోగులు గ్రీవెన్స్  సెల్ కు అప్లికేషన్  పెట్టుకోగా వాటిని ఆయా శాఖలకు కేబినెట్  సబ్  కమిటీ పంపింది. ఈ అప్లికేషన్లపై వివరణలు రాసి అందజేయాలని ఇటీవల సబ్  కమిటీ ఆదేశించింది. అయితే, అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల పక్రియ జరుగుతున్నందున టైమ్  ఇవ్వాలని సబ్  కమిటీని అధికారులు కోరినట్లు తెలుస్తోంది.  పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్,  స్థానికత ఆధారంగా ప్రమోషన్  అంశాలను పరిగణనలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్  సబ్  కమిటీ నిర్ణయించింది. 

ఈ కమిటీ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు నవీన్  మిట్టల్, మహేష్  కుమార్  ఎక్కాదత్,  హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్  బోర్డు చైర్మన్  శ్రీనివాసరావు, అడిషనల్  డీజీ షికా గోయల్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శరత్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్  దేవసేన, ఇంటర్మీడియెట్  బోర్డు  డైరెక్టర్  శ్రుతి ఓజా, సోషల్  వెల్ఫేర్  రెసిడెన్షియల్ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి, సోషల్  వెల్ఫేర్  ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పంచాయతీ రాజ్  శాఖ కార్యదర్శి లోకేష్  కుమార్, ఆయుష్  డైరెక్టర్  ప్రశాంతి, ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్  వెంకట నర్సింహారెడ్డి  వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.