- -ఉద్యోగులకు డీఏ, హైడ్రాకు మరిన్ని అధికారాలపై చర్చ!
- మూసీ నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ భేటీ శనివారం జరుగనున్నది. సెక్రటేరియెట్ లో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోద ముద్ర వేయడంతోపాటు గ్రామాల్లో రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాల కల్పన, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు చర్చ జరుగుతున్నది. దీంతోపాటు ఇందిరమ్మ కమిటీలు, కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలపైన చర్చించి, క్లారిటీ ఇస్తారని తెలుస్తున్నది. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో శుక్రవారం సీఎం భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన పెండింగ్ డీఏలపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇక గత ప్రభుత్వం తెచ్చిన ధరణి స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్ తీసుకొస్తామని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదాను ఆమోదించనున్నట్టు సమాచారం. దీంతోపాటు గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలిసింది.
నేడు కేబినెట్ భేటీ గతంలో వివిధ శాఖలకు పంపించిన వీఆర్వోలు, వీఆర్ఏలతో ఈ పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేయనున్నట్టు సమాచారం. మరోవైపు మూసీ నిర్వాసితులకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైనట్టు తెలిసింది. ఇప్పటికే వారికి డబుల్బెడ్రూం ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా ఓఆర్ఆర్ వెంట ఓపెన్‌ప్లాట్లు ఇవ్వాలని భావిస్తున్నది. మొత్తం 600 నుంచి-700 ఎకరాలను నిర్వాసితులకు కేటాయించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించే అవకాశముందని తెలుస్తున్నది.
రైతు భరోసా విధివిధానాలపై..
రైతు భరోసా విధివిధానాలపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే రైతు భరోసా గైడ్లైన్స్రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ వర్గాలతో చర్చలు జరిపిన సబ్ కమిటీ.. రైతు భరోసా గైడ్‌లైన్స్‌ను ఫైనల్ చేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ నివేదికపైనా చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం.. ఈ సమావేశాల తేదీలపైనా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తున్నది.