ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్​కు మండలి ఆమోదం

ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్​కు మండలి ఆమోదం
  • కౌన్సిల్​లో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
  • నిరసనల మధ్యే కులగణన నివేదికకూ ఆమోదం 
  • బీసీ కులగణన తప్పులతడకలా ఉందంటూ బీఆర్ఎస్ వాకౌట్​

హైదరాబాద్​సిటీ, వెలుగు:  ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్​అక్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికను మండలి  మంగళవారం ఆమోదించింది. అదేవిధంగా, బీసీ కులగణన నివేదికనూ ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అయితే, కులగణన నివేదిక తప్పుల తడకగా ఉందంటూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ముందుగా ఉదయం11గంటలకు ప్రారంభమైన సభ కొద్ది సేపటికే వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభం కాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీసీ కులగణన నివేదికను ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీసీల సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ స్థితిగతులపై ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్నారు. సర్వే కోసం గత ఏడాది అక్టోబర్10న జీవో18 విడుదల చేసినట్టు తెలిపారు. సర్వేను పర్యవేక్షించేందుకు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సర్వేకు ప్రణాళికా శాఖ నోడల్​విభాగంగా వ్యహరించిందన్నారు. ప్రతి జిల్లాలో150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేషన్ బ్లాక్​గా ఏర్పాటుచేశామని.. రాష్ట్రవ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్​వైజర్లను నియమించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 66,99,602, నగర ప్రాంతాల్లో 45,15,532 కుటుంబాలను కలిపి మొత్తం1,12,15,134 కుటుంబాలను సర్వే చేసినట్టు వివరించారు. 

3.5 లక్షల కుటుంబాలను సర్వే చేయలే..

వివిధ కారణాల వల్ల 3,56,323 కుటుంబాలను సర్వే చేయలేదని భట్టి తెలిపారు. సర్వేలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీల సంఖ్య స్పష్టంగా వెల్లడైందన్నారు. సర్వే పూర్తి శాస్త్రీయ పద్ధతిలో జరిగిందని, దేశచరిత్రలోనే ఇదే అత్యంత పారదర్శక సర్వే అని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​ సభ్యులు స్పందిస్తూ.. సర్వే నివేదికపై చర్చ జరగాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్​పక్షనేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు గతంలో బీసీలకు 49 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారని, కానీ, బీసీలు 46 శాతమే ఉన్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకుని, బీసీల శాతం తగ్గిందనడం సరికాదన్నారు. బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభానే ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ఏటా సగటున 13.5 శాతం జనాభా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయని.. ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణ జనాభా 4.18 కోట్లు ఉండాలన్నారు. అసలు ఎన్యుమరేటర్లు సర్వే కోసం రానేలేదన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయన్నారు.

రీ సర్వే చేయాలని సభ్యుల డిమాండ్ 

గతంలో బీఆర్ఎస్ నిర్వహించిన సమగ్ర సర్వే వివరాలు ఇప్పటికీ బయటపెట్టలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్​ అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు అణచివేతకు గురయ్యారన్నారు. బీఆర్ఎస్​సభ్యుడు బండ ప్రకాశ్ మాట్లాడుతూ..  రిజర్వేషన్లలో క్రిమీలేయర్​అమలు చేయవద్దన్నారు. అసలు ఈ పదం రాజ్యాంగంలోనే లేదన్నారు. మరో సభ్యుడు ఏవీఎన్​రెడ్డి మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లుగా ఔట్​సోర్సింగ్​వారిని నియమించారని, వారి వల్ల వచ్చే ఫలితాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. 

మరో సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. బీసీ కులగణనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ సర్వే చేయాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యుడు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోవాలన్నారు. మన సర్వే పై మనకే నమ్మకం ఉందో లేదో అన్న అనుమానం కలుగుతోందన్నారు.  మరో సభ్యుడు జీవన్​రెడ్డి మాట్లాడుతూ.. కులగణన విషయంలో ఆందోళనలను ప్రభుత్వం తొలగించాలన్నారు.