
- ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- దేశానికే తెలంగాణ కుల గణన సర్వే ఆదర్శం
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఇది ఎంతో తోడ్పడుతుందని వ్యాఖ్య
- సర్వే చేపట్టిన అధికారులు, ఉద్యోగులకు అభినందనలు
- 96 శాతం సర్వే పూర్తయిందని ఆఫీసర్ల వెల్లడి
- 4 శాతం వివరాలే రాలేదని.. అదీ కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్లనేనని వివరణ
హైదరాబాద్, వెలుగు: సమగ్ర కులగణన సర్వే తుది నివేదికను ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ రిపోర్ట్ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కులగణనను చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయన్నారు.
కులగణన సర్వేపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. సర్వేను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని.. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. మూడు రోజుల్లోగా ఫైనల్ రిపోర్ట్‌ను అందజేయాలని అధికారులకు సూచించారు. సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని ఆఫీసర్లు తెలిపారు.
4 శాతం వివరాలు రాలే
రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించగా.. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించారు. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు సేకరించాయని సీఎంకు అధికారులు వివరించారు. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేసినట్లు తెలిపారు. కొన్ని చోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, కొన్ని ఇండ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటం తదితర కారణాలతో 4 శాతం వివరాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.
ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వేలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు.. దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు పాలుపంచుకున్నారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎస్ శాంతి కుమారి , వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే..!
అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే నిరుడు ఫిబ్రవరి 4న సీఎం రేవంత్ నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కుల గణన చేపట్టేందుకు నిర్ణయించింది. ఫిబ్రవరి 16న ఈ సర్వే చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. సెప్టెంబర్ 12న విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన ఈ సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫారసులపై అక్టోబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన పేరిట సర్వే చేపట్టాలంటూ ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10న ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధివిధానాలతో జీవో నెం.18 జారీ చేసింది. నవంబర్ 6న రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే – 2024) మొదలైంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో పూర్తయింది.
55 శాతం దాకా బీసీలు
ఓవరాల్‌గా రాష్ట్రంలో 55 శాతం దాకా బీసీలు ఉన్నట్లు కుల గణనలో వెల్లడైనట్లు తెలిసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రతి కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు? వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏమిటి? అనేది కులగణన రిపోర్ట్‌లో బటయకు రానుంది. కుటుంబాలు, కులాలతోపాటు ప్రతి సమాచారాన్ని కోడ్ రూపంలో ఎంట్రీ చేశారు. ఏయే కులాలు రాజకీయంగా, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఏ స్థాయిలో ఉన్నాయో కూడా కులగణన నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సమగ్ర కుల గణన సర్వేలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొనలేదు. దాదాపు 4.64 లక్షలు కుటుంబాలు సమగ్ర కుల గణనసర్వేకు దూరంగా ఉన్నాయి.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై లీగల్ ఒపీనియన్!
బీసీ రిజర్వేషన్ల పెంపు ఎలా అనేదానిపైనా రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నది. లీగల్ చిక్కులు రాకుండా అడ్వకేట్ జనరల్‌కు పలు అంశాలతో కూడిన ఒక నివేదికను పంపినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు రిజర్వేషన్లపై ఏం చెప్తున్నాయనే దానిపై పూర్తి స్థాయిలో లీగల్ ఓపినియన్ తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 2వ తేదీనే సమగ్ర కుల గణన నివేదికతో పాటు అడ్వకేట్ జనరల్ కూడా లీగల్ ఓపినియన్ రిపోర్టును ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తున్నది. అందుకు తగ్గట్టు బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
యాదగిరిగుట్టలో రాజకీయాలు ఉండొద్దు
యాదగిరిగుట్టలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్టలో ఆలయ బోర్డు ఏర్పాటుకు సంబంధించి బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనల్లో సీఎం పలు మార్పులు సూచించారు. సమావేశంలో సీఎస్శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఫస్ట్ వీక్‌లో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ
కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్‌పై ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది. కేబినెట్లో ఆమోద ముద్ర తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నది. కులగణన నివేదిక, బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టి, తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రానుంది.