ఎన్నికల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : వికాస్ రాజ్

ఎన్నికల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి :  వికాస్ రాజ్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సి– విజల్ తోపాటు జిల్లా ఎన్నికల అధికారుల ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన కంప్లెయిట్ మానిటరింగ్​ సెల్ పై ప్రచారం నిర్వహించాలని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్ లో అడిషనల్ డీజీ సంజయ్​ కుమార్ జైన్ తో కలిసి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సి– విజల్ యాప్ పై అన్ని గ్రామాల్లో పోస్టర్లు అంటించాలని, లీడర్ల నుంచి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ  అరికట్టేందుకు అధికారులు ప్రత్యేకంగా పని చేయాలని చెప్పారు. మహబూబ్ నగర్ కలెక్టర్ జి.రవి నాయక్​ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు. గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి, వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్, మహబూబ్ నగర్ ఎస్పీ హర్షవర్ధన్, గద్వాల ఎస్పీ రతిరాజ్, నారాయణపేట ఎస్పీ యోగేశ్​ వర్ధన్, వనపర్తి ఎస్పీ రక్షిత, నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ లు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై తీసుకున్న చర్యలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహన్, మక్తల్ రిటర్నింగ్ అధికారి  మయాంక్ మిట్టల్, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కుమార్ దీపక్, గద్వాల జిల్లా రిటర్నింగ్ అధికారి ఐఏఎస్ అధికారి అపూర్వ చౌహాన్,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీసు నోడల్ అధికారులు పాల్గొన్నారు. 

పోలింగ్​, కౌటింగ్​ కేంద్రాల తనిఖీ.. 

 మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాశ్​ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిపాదించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ,అలాగే మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను సీఈఓ వికాస్​ రాజ్​ తనిఖీ చేశారు .