- తెలంగాణ పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు, పీసీబీ సత్యనారాయణ రెడ్డి
చేవెళ్ల, వెలుగు : విద్యుత్ టవర్ల నిర్మాణాలతో భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడి ఘనపూర్, దేవరంపల్లి, ఖానాపూర్, అంతారం తదితర గ్రామాల్లో టవర్ల నిర్మాణ పనులను బుధవారం రైతులు అడ్డుకొని నిరసన తెలిపారు. వారికి మద్దతు తెలిపి ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరం– -బీదర్ 765 కిలోవాట్ల లైన్ కు టవర్లను నిర్మిస్తుండగా.. కరెంటు యాక్ట్ – 2003 కింద విద్యుత్ కంపెనీలు రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అన్ని గ్రామాల్లో ఎకరం భూమి విలువ రూ. 2 నుంచి రూ. 5 కోట్లు ఉందన్నారు. భూసేకరణ చట్టం –2013 కింద భూముల మార్కెట్ ధరలను పరిగణలోకి తీసుకొని నిర్ణయించాలని కోరారు. పవర్ గ్రిడ్ కంపెనీ మాత్రం రైతులను భయపెట్టి, మార్కెట్ విలువలో 10 శాతం నష్ట పరిహారం చెల్లించి మోసగిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు రాంరెడ్డి, నరహరి రెడ్డి, నర్సింలు, కాంగ్రెస్ నేతలు ఈదులపల్లి రాములు, నర్సింలు, కృష్ణ, వెంకటేశ్, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.