క్యూలైన్ లో ఉన్నవారు ఎంత రాత్రైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కొన్ని చోట్ల గొడవలు జరిగాయని.. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పారు. మాక్ పోల్ తర్వాత మూడు చోట్ల మాత్రమే ఈవీఎంలు మోరాయించాయని అన్నారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలిస్తామని చెప్పారు. కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లకు ట్రైనింగ్ ఇచ్చామని ఆయన అన్నారు. ఈ నెల 6న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.
పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్ లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నామని వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పుడు ఎవరైనా వస్తే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఈవీఎంలు మోరాయిస్తే.. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేస్తామని వికాస్ రాజ్ వెల్లడించారు. ఇక ఇప్పటివరకు 6వేల 100 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. మొత్తం 191 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు.ఇప్పటివరకు8.26 కోట్ల మెటీరియల్, డబ్బులు సీజ్ అయ్యాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజులో మరో 98 ఫిర్యాదులు అందాయని చెప్పారు.