మునుగోడులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన వికాస్ రాజ్

నల్గొండ జిల్లా: మునుగోడులో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పర్యటించారు. శనివారం మునుగోడు మండలం పలివేల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెంట నల్గొండ కలెక్టర్, ఎస్పీ ఉన్నారు.

యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ కు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తు మార్పు వ్యవహారంలో ఎన్నికల కమిషన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అప్పటి ఆర్వో జగన్నాథ్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీకి మేలు చేసేందుకే రోడ్డు రోలర్ గుర్తుకు బదులు బేబీ వాకర్ గుర్తు కేటాయించారని విమర్శలు వచ్చాయి.

యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ ఈ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ.. జగన్నాథ్ రావును సస్పెండ్ చేసి మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగించింది. మరోవైపు మునుగోడుకు చెందిన 300మంది ఓటర్లను యాదాద్రికి తీసుకెళ్లి ప్రమాణం చేయించిన ఘటనపై ఈసీ స్పందించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. యాదాద్రి ఖర్చును మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో వేయాలని ఆదేశించింది.