
- నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్, ఉత్తమ్ భేటీ
- సమ్మక్కసాగర్ ఎన్‌వోసీ, సీతారామ సాగర్ అనుమతులపైనా చర్చ
- ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీటి వాటాలపై తాడోపేడో తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమస్యను నేరుగా కేంద్రం వద్దే పరిష్కరించుకునేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై ఆదివారం జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్ని నీళ్లు తరలించుకుపోయింది? వాళ్ల వాటా ఎంత? అనే అంశాల గురించి అధికారులతో చర్చించారు. అంతేగాకుండా ఏపీ అనుమతులు లేకుండా అక్రమంగా కడ్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులపై ప్రధానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది.
ఇటు సమ్మక్క సాగర్ బ్యారేజీకి చత్తీస్‌గఢ్ ఎన్వోసీ ఇచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తారని తెలిసింది. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో చత్తీస్‌గఢ్‌ను ఒప్పించేలా చొరవ తీసుకోవాల్సిందిగా కోరనున్నారు. గోదావరి కావేరి లింక్‌లో ఈ బ్యారేజీ కీలకంగా మారిన నేపథ్యంలో దీనిపై ముందడుగు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు తెలిసింది.
సీతారామ సాగర్ ప్రాజెక్ట్‌కు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చేలా చూడాలని కోరనున్నట్టు చెప్తున్నారు. ఇటీవల జరిగిన టీఏసీ సమావేశంలో డిజైన్లను రివ్యూ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనిపైనా పునరాలోచించాల్సిందిగా కోరే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదికపైనా జలశక్తి శాఖతో చర్చించే అవకాశాలున్నాయని చెప్తున్నారు.