హైదరాబాద్: మూసీ బాధితులకు అండగా ఉంటామని, ఏ వ్యక్తికీ అన్యాయం జరగనివ్వమని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ చెప్పారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ.. అప్పట్లో మూసీకి భారీ వరదలు వచ్చాయని, గతంలో వరదలతో ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. గతంలోనూ నిర్వాసితులను తరలించారని గుర్తుచేశారు. మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు చేశారని చెప్పారు.
హైదరాబాద్ లో ప్రస్తుతం కోటి జనాభా ఉందని, హైదరాబాద్కు వరదల ముంపును తగ్గించేందుకే మూసీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు దానకిషోర్ స్పష్టం చేశారు. మూసీకి వరద పోటెత్తితే ఇబ్బంది పడేది స్థానికంగా ఉండే జనాలేనని చెప్పారు. ప్రముఖ కట్టడాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామని, నగరంలో వచ్చే మురికినంతా క్లీన్ చేసే ప్రక్రియ మొదలుపెట్టామని పేర్కొన్నారు. మూసీలో మంచినీరు ప్రవహిస్తే వ్యవసాయం మరింత పెరుగుతుందని, 2026 నాటికి మూసీలో మంచినీరు ప్రవహించేలా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తామని దానకిషోర్ చెప్పారు.