పోడు కేసుల ఎత్తివేతలో సర్కారు వివక్ష! .. పట్టాలొచ్చిన వారిపైనే కేసులు తీసేస్తరట 

  • మిగిలిన వారిపై కేసులు యథాతథం 
  • ఇంకా స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న పోడురైతులు
  • అందరిపై కేసులు ఎత్తేశామని చెప్తున్న సీఎం కేసీఆర్​

ఖమ్మం/ ఆసిఫాబాద్​, వెలుగు : రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలిచ్చామని, పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తేశామని ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కేసీఆర్​ చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. సాగులో ఉన్న పోడు భూముల్లో 33 శాతం జాగలకే పట్టాలిచ్చిన సర్కారు ఆయా లబ్ధిదారులపై ఉన్న కేసులను మాత్రమే ఎత్తివేస్తున్నది. మిగిలిన 67 శాతం పోడు భూములను పెండింగ్​లో పెట్టడమే కాకుండా, ఆయా చోట్ల భూపోరాటాలు చేసిన గిరిజనులు, గిరిజనేతరులపై పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు పెట్టిన కేసులను ఎత్తివేయడం లేదు. సర్కారు చూపుతున్న ఈ వివక్ష వల్ల పోడు రైతులు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ఈ ఏడాది జూన్ నెల​లో పోడు పట్టాలందుకున్న వారిపైనే కేసులు తొలగించాలని అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదే శాలు స్పష్టంగా ఉండడంతో కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నారు. 2005 అక్టోబర్ 12వ తేదీకి ముందు సాగు చేసుకుంటున్న వారు మాత్రమే పట్టాలు పొందేందుకు అర్హులు కాగా, ఆ తర్వాత నుంచి భూమి సాగు చేసుకుంటున్న వారిపై కేసులు ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి. 

1922 కేసులే ఎత్తేస్తరట

రాష్ట్రవ్యాప్తంగా గతేడాది పోడు భూముల పట్టాల కోసం దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం, ఈ ఏడాది జూన్​లో అర్హులైన వారికి పట్టాలను పంపిణీ చేసింది. 28 జిల్లాల పరిధిలో 12.14 లక్షల ఎకరాల కోసం 4.14 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 4,06,369 ఎకరాలకు సంబంధించి 1,51,146 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చింది. అయితే, అంతకుముందు భూముల కోసం పోరాటాలు చేసిన గిరిజనులు, గిరిజనేతరులపై ఫారెస్ట్​, పోలీసు అధికారులు కేసులు పెట్టారు.

ఈ ఏడాది జూన్​30న ఆసిఫాబాద్​ సభలో పోడు కేసులను ఎత్తివేస్తున్నామంటూ సీఎం కేసీఆర్​ ప్రకటించారు. పోడు భూములకు పట్టాలిస్తున్న తర్వాత కూడా ఇంకా కేసులేంటి, ఇదో పెద్ద జోక్​ అంటూ చెప్పుకొచ్చారు. అయితే, పట్టాలు తీసుకున్న వారిపై మాత్రమే కేసులు ఎత్తివేయాలంటూ గత నెల చివరి వారంలో సర్కారు నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పట్టాలిచ్చిన వారిపై 1922 కేసులు మాత్రమే ఉన్నట్టు గుర్తించిన ఫారెస్ట్​ అధికారులు వాటిని మాత్రమే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220 కేసులను తొలగించనుండగా ఇంకా 350 మందికి పైగానే పోడు సాగుదారులపై కేసులు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 176  కేసులు, కుమ్రం భీమ్​ఆసిఫాబాద్​జిల్లాలో 132 కేసులు మాత్రమే తొలగించనున్నారు. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల పరిధిలో 25 మందిపై కేసులు నమోదు కాగా, ఎత్తివేత అంశం కోర్టు పరిధిలో ఉందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 300 మంది, వాజేడు మండలంలో 250 మంది గిరిజనులపై ఫారెస్టోళ్లు పోడు కేసులు పెట్టారు.  

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  ఘటనలు..

  • కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లాలోని సార్సాలలో 2019 జూన్ 30న గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటుండగా అటవీ అధికారులు ఆ భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ అనిత, సిబ్బందిని రైతులను అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్పీ వైస్ చైర్మన్ ​కోనేరు కృష్ణారావు వచ్చారు. ఈ క్రమంలో ఘర్షణ మొదలై అటవీశాఖాధికారులపై గిరిజనులు మర్లవడ్డారు. ఈ ఘటనలో 38 మందిపై కేసులు పెట్టి  రెండు నెలలకు పైగా జైలుకు పంపారు.  
  •  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్​లో గతేడాది ఆగస్టు 3న రైతులు సాగు చేస్తున్న ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ సిబ్బంది వెళ్లగా గొడవ జరిగింది. గిరిజనులు తమపై గొడ్డళ్లు, కత్తులు, రాళ్లతో దాడి చేశారంటూ అటవీశాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 17 మంది మహిళలు, నలుగురు మగవారిపై కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 6న ముగ్గురు పిల్లలతో పాటు తల్లులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాలింతలపైనా కేసులు పెట్టడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత పోలీసులు వీరిపై హత్యాయత్నం సెక్షన్లను తొలగించారు. వారం తర్వాత బాధితులు ఖమ్మం జిల్లా జైలు నుంచి విడుదలైనా కేసుల బాధ మాత్రం తొలగిపోలేదు. 2005 కు ముందు పోడు భూముల్లో వీరు పొజిషన్​లో లేరని, అందుకని ఎల్లన్ననగర్​లో సర్వే నిర్వహించలేదని ఆఫ్​ ది రికార్డు చెబుతున్నారు. దీంతో పట్టాలు దక్కకపోగా, కేసులు కొనసాగుతున్నాయి. 
  • మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటుండగా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకున్నారు. పోడు భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనులు, మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లి గుడిసెలు తొలగించారు. 12 మందిపై కేసులు నమోదు చేసి ఆదిలాబాద్ జైలులో14 రోజులు ఉంచారు. ఇప్పటికీ ఈ కేసుల్లో పేషీలకు తిరుగుతున్న గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. కేసులు ఎత్తేస్తే పోరాటానికి న్యాయం దక్కుతుందని ఆశతో ఉన్నారు.

కేసులు ఎత్తేస్తమంటే సంబురపడ్డం 

నాలుగేండ్ల కింద పోడు భూమి సాగు చేస్తుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి అడ్డుకున్నరు. అక్కడ గొడవ జరిగితే నాపై నా భర్తపై, కొడుకుపై కేసులు పెట్టిన్రు. అప్పటి నుంచి మా ఐదెకరాల భూమి వాళ్ల ఆధీనంలోనే ఉంది. ఉపాధి లేక కూలి పని చేసుకుని బతుకుతున్నం. సీఎం కేసులు ఎత్తేస్తం అంటే సంబురపడ్డం. కానీ, పట్టాలు తీసుకున్న వాళ్ల కేసులే ఎత్తేస్తమంటున్నరు.  

 బిబ్బెర శ్యామల, సార్సాల, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా 

పోడు కేసులన్నీ ఎత్తివేయాలి మిగిలిన వాటికి పట్టాలివ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం కేవలం పట్టాలు పొందిన గిరిజనుల మీద కేసులు ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఇది అన్యాయం. సీఎం కేసీఆర్​ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం లేదు. అర్హత ఉన్నా చాలామందికి పట్టాలు ఇవ్వలేదు. ఎల్లన్ననగర్, గుడివాడు, గంగులపల్లి తదితర చోట్ల పట్టాలు రాని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందరిమీద కేసులు ఎత్తివేసి హక్కు పత్రాలు ఇవ్వాలి. సర్వే చేయని చోట మళ్లీ సర్వే నిర్వహించాలి.  

పోటు రంగారావు, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి  

పన్నెండు కేసుల్లో కోర్టుకు హాజరవుతున్నా..

2019 సంవత్సరం జనవరిలో మాణిక్యారం ప్రాంతంలోని పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు జేసీబీతో ట్రెంచ్ తీస్తుండగా అడ్డుకున్నందుకు నాతో పాటు మరో 18మంది పోడు రైతులపై కేసులు పెట్టారు. నాపై ఇట్లాంటివి పన్నెండు కేసులున్నయ్. ఆ కేసులకు సంబంధించి కోర్టుకు హాజరవుతున్న.  ప్రభుత్వం పోడు కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినా, కారేపల్లి మండలంలో ఒక్క కేసు కూడా ఎత్తివేయలే.  

- కొండెబోయిన నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు, పోడు రైతు, కారేపల్లి