హైదరాబాద్, వెలుగు : రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన భూసేకరణ ప్రక్రియను వచ్చే 3 నెలల్లో పూర్తి చేయడంతోపాటు, ఆర్ఆర్ఆర్(ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్(దక్షిణం) భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర రవాణా ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం విజ్ఞప్తి చేశారు.
భారత్మాల పరియోజన ఫేజ్ వన్ లో రీజనల్ రింగ్ రోడ్డు(ఉత్తరం) 158.645 కిలోమీటర్ల మేరకు నిర్మించ తలపెట్టారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు 4782 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 3605 ఎకరాల భూసేకరణ పురోగతిలో ఉంది. గత తొమ్మిది నెలలుగా ఈ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు పడలేదు. దీంతో నేషనల్ హైవే అథారిటీ తో తలెత్తిన చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నం జరగలేదు. ఫలితంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని.. మంగళవారం సీఎంవో రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవుటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందించాలని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయడంపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రభుత్వంభావిస్తున్నది.