అకడమిక్ ఇయర్  మరింత ముందుకు!

అకడమిక్ ఇయర్  మరింత ముందుకు!
  • కసరత్తు చేస్తున్న హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎడ్యుకేషన్  అకడమిక్  ఇయర్​లో మార్పులు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ప్రస్తుతం డిగ్రీ, పీజీ, పలు ప్రొఫెషనల్  కోర్సుల అడ్మిషన్లు నవంబర్, డిసెంబర్  వరకూ కొనసాగుతున్నాయి. దీనికి చెక్ పెట్టి మరింత ముందుకు తీసుకుపోవాలని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్  ఆన్​లైన్ ప్రక్రియ కొనసాగుతోంది. పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు సీపీ గెట్, ఇంజినీరింగ్  ఫార్మసీ అడ్మిషన్ల కోసం ఈఏపీ సెట్, ఎంబీఏ, ఎంసీఏ కోసం ఐసెట్, బీఈడీ కోసం ఎడ్ సెట్... ఇలా ప్రతి కోర్సులో అడ్మిషన్ల కోసం హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ టెస్టులన్నీ మే, జూన్  నెలల్లో ఉంటున్నాయి. అయినా.. అడ్మిషన్ల ప్రక్రియ మాత్రం నవంబర్  వరకు సాగుతోంది. దీని ప్రభావం అకడమిక్  ఇయర్ పై పడుతోంది. ఇటీవలే ఉన్నత విద్యా మండలి చైర్మన్​గా బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్  బాలకిష్టారెడ్డి.. దీనిపై వర్సిటీ నుంచి సమాచారం సేకరించారు.

వర్సిటీల అకడమిక్  క్యాలెండర్లనూ పరిశీలిస్తున్నారు. త్వరలోనే వీసీలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారు. మే నెలలోనే ప్రవేశపరీక్షలు నిర్వహించి.. జూన్, జులై, ఆగస్టు వరకూ అన్ని కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని కౌన్సిల్  అధికారులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా డిగ్రీ ఫైనల్  సెమిస్టర్  పరీక్షలనూ ముందుగా నిర్వహించి, ఫలితాలు త్వరగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.

అయితే, ఇంజినీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ను ఏఐసీటీఈ ఆలస్యంగా ఇస్తుండడం కూడా కౌన్సెలింగ్  లేట్  అవుతోంది. మరోపక్క ఫార్మసీ కాలేజీలకు, లా కాలేజీలకు అనుమతులు ఆలస్యంగా వస్తుండటమూ దీనికి మరో కారణం. రాష్ట్రాల్లో జరిగే వివిధ కోర్సులకు జరిగే కౌన్సెలింగ్​లతో సంబంధం లేకుండా జేఈఈ, నీట్  అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తోంది. దీని ద్వారా కూడా ఈఏపీ సెట్  కౌన్సెలింగ్  ఆలస్యమవుతోంది. రాష్ట్రంలో ఇంకా బీ ఫార్మసీ, పీజీతో పాటు పలు కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తుండడం గమనార్హం.