రంగరాజన్ పై దాడి..సీఎం రేవంత్ ఏమన్నారంటే.?

రంగరాజన్ పై దాడి..సీఎం రేవంత్ ఏమన్నారంటే.?
  • ఇలాంటి దాడులను సహించం: సీఎం రేవంత్ రెడ్డి 
  • రంగరాజన్​కు ఫోన్​లో పరామర్శ 
  • ఇంటికెళ్లి పరామర్శించిన మంత్రి సురేఖ 
  • దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన  ఫోన్ లో రంగరాజన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిందితులపై కఠిన చర్యలు తీస్కుంటామని తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని రంగరాజన్ కు భరోసా ఇచ్చారు. రంగరాజన్, ఆయన తండ్రి సౌందర రాజన్ ను మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. రామరాజ్యం పేరుతో రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తూ రావణరాజ్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఈ ఘటనపై తెలంగాణ సమాజం శాఖలుగా చీలిపోయి భావోద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలి” అని పేర్కొన్నారు. రంగరాజన్ పై దాడిని మంత్రి శ్రీధర్ బాబు కూడా ఖండించారు. ఇది హేయమైన చర్య అని మండిపడ్డారు. రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. 

ఇది ధర్మపరిరక్షణపై దాడి: పవన్ కల్యాణ్  

రంగరాజన్ పై దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. ఇది ధర్మపరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా ధర్మ పరిరక్షణ, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు రంగరాజన్ పోరాటం చేస్తున్నారు. ఆయనపై దాడి వెనుక ఉన్న కారణాలేంటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి” అని కోరారు. కాగా, జనసేన ఉపాధ్యక్షుడు, టీటీడీ బోర్డు మెంబర్ బొంగునూరి మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ నేమూరి శేఖర్ గౌడ్ సోమవారం రంగరాజన్ ను పరామర్శించారు.  

ఇది ప్రభుత్వ వైఫల్యం: కేటీఆర్ 

రంగరాజన్ పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. సోమవారం ఆయన రంగరాజన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయి. దాడికి పాల్పడ్డ వాళ్లు ఏ ముసుగులో ఉన్నా.. ఏ జెండా పట్టుకున్నా కఠినంగా శిక్షించాలి. అవసరమైతే చిలుకూరు ఆలయం వద్ద భద్రత ఏర్పాటు చేయాలి” అని కోరారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలి: జాన్ వెస్లీ  

రంగరాజన్‌‌‌‌ పై దాడిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖండించారు. ‘‘రంగరాజన్‌‌‌‌ గతంలో ఓ దళితుడిని ఆధ్యాత్మిక గురువుగా తీర్చిదిద్ది, చిలుకూరు ఆలయంలోనే అర్చకుడిగా నియమించారు. కుల అసమానతలు ఉండకూడదని ఆయన ఆకాంక్షించారు. అది ఓర్వలేని వీహెచ్‌‌‌‌పీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ మతోన్మాదులు దాడికి తెగబడటం అత్యంత దుర్మార్గమన్నారు. 

ఇది హిందూ సమాజంపై దాడి: వీహెచ్ పీ 

రంగరాజన్ పై దాడి చేసినోళ్లను కఠినంగా శిక్షించాలని వీహెచ్ పీ ప్రాంత అధ్యక్షుడు నర్సింహ మూర్తి, జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ కోరారు. ఈ దాడిని హిందూ సమాజంపై దాడిగా భావిస్తున్నామన్నారు. నిందితుల వెనుకున్నవారిని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.