రెండు చోట్ల నుంచి సీఎం కేసీఆర్ పోటీ

2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ తోపాటు.. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

రెండు నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయటం సంచలనంగా మారింది. అది కూడా అసెంబ్లీ స్థానాలకే పోటీ చేయటం విశేషం.

2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచిన కేసీఆర్.. ఈసారి మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవటం ఆసక్తిగా మారింది. కొన్ని రోజులుగా ఈ విషయంలో ప్రచారం జరుగుతుంది. అయితే గజ్వేల్ వదిలి వెళ్లేది లేదని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ శ్రేణులు వివరణ ఇస్తూ వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ను స్వయంగా ప్రకటించిన కేసీఆర్.. తాను కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.