కామారెడ్డిపై సీఎం కేసీఆర్ స్పెషల్​ ఫోకస్​

కామారెడ్డిపై  సీఎం కేసీఆర్ స్పెషల్​ ఫోకస్​
  • కామారెడ్డిపై  స్పెషల్​ ఫోకస్​.. నియోజకవర్గంలోని పెండింగ్​ పనుల్లో కదలిక
  • ఈ నెల 14నే రూ. 45 కోట్ల ఫండ్స్ శాంక్షన్​
  • సుమారు రూ.700 కోట్లతో మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రపోజల్స్​  
  • ఇతర అభివృద్ధి పనులకు​ ప్లాన్​ రెడీ చేస్తున్న లోకల్​ లీడర్లు

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్​ఎస్​ హైకమాండ్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కూడా తాను పోటీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించినందున అక్కడి పెండింగ్​ పనులను చకచకా పూర్తి చేయాలని భావిస్తున్నది. ఈ నెల 14న  కామారెడ్డి టౌన్​కు మంత్రి కేటీఆర్​ రూ.45 కోట్ల ఫండ్స్​ శాంక్షన్​ చేస్తున్నట్లు ప్రకటించగా..  రూ.25 కోట్లతో  ఏయే పనులు చేపట్టనున్నారో డిటెయిల్స్​తో  తాజాగా జీవో రిలీజ్​ చేశారు. 

ఇక చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు సాగునీరందించేందుకు వీలుగా రూ.695 కోట్లతో మూడు రిజర్వాయర్ల నిర్మాణం కోసం అధికారులు తాజాగా సర్కారుకు  ప్రపోజల్స్​ పంపారు. దీంతో పాటు కేసీఆర్​ ఆదేశాలతో కామారెడ్డి సమగ్ర అభివృద్ధి కోసం ఒక యాక్షన్​ ప్లాన్​ తయారు చేయాలని భావిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్​గానీ, మంత్రి కేటీఆర్ గానీ అతి త్వరలో​ కామారెడ్డి నియోజకవర్గ బీఆర్​ఎస్​ లీడర్లతో  భేటీ కానున్నట్టు తెలుస్తున్నది. 

లీడర్ల నుంచి రిపోర్ట్​ తీసుకున్న కేసీఆర్​

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్​తో పాటు  కామారెడ్డి నుంచి కూడా పోటీ  చేయనున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్​.. ఆ వెంటనే కామారెడ్డికి చెందిన సీనియర్​ లీడర్లను  ప్రగతి భవన్ పిలిపించుకొని జిల్లా, నియోజకవర్గం పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నేతలు జిల్లాలోని సమస్యలు, పెండింగ్​పనుల గురించి సీఎంకు  వివరించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్యాకేజీ 22 కింద చేపట్టిన పనులతో పాటు కామారెడ్డి టౌన్​లో డెవలప్​మెంట్​వర్క్స్​ పెండింగ్​లో ఉండడం పార్టీకి మైనస్​ అని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ పనులకు ప్రపోజల్స్​ పంపడంతో పాటు ఎడ్యుకేషన్​, హెల్త్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో ఉపాధి, అభివృద్ధి అవకాశాలు, అవసరాలపై నివేదిక ఇవ్వాలని సీఎం కోరినట్టు సమాచారం. దీంతో  ఇప్పటికిప్పుడు చేపట్టవలసిన పనులతో పాటు ఇతర పనులు ఏమిటనే దానిపై లోకల్​ లీడర్లు, ఆఫీసర్ల సాయంతో రిపోర్టు తయారు చేస్తున్నట్టు తెలుస్తున్నది. 

కాళేశ్వరం రిజర్వాయర్ల ప్రపోజల్స్​ రెడీ

కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులు చాలా స్లోగా కొనసాగుతున్నాయి. 2004లో  ప్రాణహిత– చేవెళ్ల పథకంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు  ప్రారంభించింది. ఇందులో భాగంగా సదాశివనగర్​ మండలం భూంపల్లి రిజర్వాయర్  నుంచి గ్రావిటీ ద్వారా  కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని  లక్షా 90 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది.  భూంపల్లి వద్ద రిజర్వాయర్​తో పాటు  2 మెయిన్​ కెనాల్స్​ పనులు కాంగ్రెస్​ హయాంలో  కొంత మేరకు జరిగాయి. బీఆర్​ఎస్​ పవర్​లోకి వచ్చాక పనులు మందగించాయి. మొత్తం  4 వేల ఎకరాల భూ సేకరణకు గాను  సగం మాత్రమే పూర్తయ్యింది. 

మిగతా భూముల సేకరణ, రిజర్వాయర్ల నిర్మాణం,  కాల్వల  పనులకు అవసరమైన ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడం ఈ పరిస్థితికి కారణం.  2018 ఎన్నికలు కాగానే పనులు కంప్లీట్​ చేస్తామని అప్పట్లో ఎన్నికల ప్రచారంలో  కేసీఆర్​  ప్రకటించారు.  2021లో  కలెక్టరేట్ బిల్డింగ్​ ప్రారంభించినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు పనులు స్పీడందుకోలేదు. కేసీఆర్​ పోటీ ప్రకటన రాగానే.. 22 ప్యాకేజీలో భాగంగా కామారెడ్డి మండలం తిమ్మక్​పల్లి,  లింగంపేట మండలం మోతె, గాంధారి మండలం కాటేవాడిలో నిర్మించాల్సిన రిజర్వాయర్ల కు సంబంధించి  ప్రపోజల్స్  పంపాలని ఇక్కడి అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో తిమ్మక్​పల్లి, మోతే రిజర్వాయర్లకు ఒక్కో దానికి రూ. 310 కోట్లు,  కాటేవాడికి  రూ.75 కోట్లతో ప్రపోజల్స్​ వెళ్లాయి.

డెవలప్​మెంట్​కు రిలీజ్​ అవుతున్న ఫండ్స్​

ఈ  నెల 14న కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో మంత్రి కేటీఆర్​ పర్యటించారు.  కామారెడ్డి టౌన్​కు  రూ.45 కోట్ల ఫండ్స్​ శాంక్షన్​ చేస్తున్నట్లు  ప్రకటించారు. ఇందులో రూ.25 కోట్లతో  ఏయే పనులు చేపట్టాలన్న డిటెయిల్స్​తో జీవో కూడా ఇచ్చారు.  మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల వెడల్పు పనులు, సెంట్రల్​ లైటింగ్​, డివైడర్ల నిర్మాణం,  వార్డులో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు,  కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్​ నిర్మాణాలకు ఈ ఫండ్స్ ఖర్చు చేస్తారు. స్టేడియం కాంప్లెక్స్​ తదితర  పనులకు మిగతా రూ. 20 కోట్లు కేటాయిం చారు. ఇంకా నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న పనులతో ప్లాన్​  తయారు చేయడంలో లోకల్​ లీడర్లు బిజీ అయ్యారు.