ఇయ్యాల (సెప్టెంబర్ 16) పాలమూరు ప్రారంభం.. స్విచ్చాన్ చేయనున్న కేసీఆర్

  • ఎల్లూరు పంప్ హౌస్ వద్ద స్విచ్చాన్ చేయనున్న కేసీఆర్  
  • అనంతరం కొల్లాపూర్ పట్టణంలో బహిరంగ సభ

హైదరాబాద్/నాగర్​కర్నూల్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​ స్కీమ్​ను సీఎం కేసీఆర్ ​శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్​ నుంచి సీఎం రోడ్డు మార్గాన నాగర్​కర్నూల్​కు బయల్దేరుతారు. మార్గమధ్యలో మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగర్​కర్నూల్​లోని తేజ గార్డెన్స్​కు చేరుకుంటారు. అక్కడ లంచ్​చేసి మధ్యాహ్నం 2:30 గంటలకు నార్లాపూర్​ రిజర్వాయర్ ​సమీపలోని కంట్రోల్​రూమ్​కు చేరుకుంటారు. 3:30 గంటలకు మోటారును స్విచ్​ఆన్​చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. 4 గంటలకు నార్లాపూర్​రిజర్వాయర్​వద్దకు చేరుకుని కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.

 4:45 గంటలకు కొల్లాపూర్​ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి ఇంటికి చేరుకుని కాసేపు అక్కడే ఉంటారు. 5గంటలకు కొల్లాపూర్​లోని సింగోటం చౌరస్తాలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం రోడ్డు మార్గంలో ప్రగతి భవన్​కు బయల్దేరుతారు. శ్రీశైలం ఫోర్​షోర్ ​నుంచి 1.22 కిలోమీటర్ల వరకు అప్రోచ్​చానల్​ ద్వారా ఎల్లూరు పంపుహౌస్​హెడ్​రెగ్యులేటర్​కు నీళ్లు చేరుతాయి. అక్కడి నుంచి సర్జ్​పూల్​లోకి నీళ్లు వస్తాయి. పంపుహౌస్​ దిగువన డ్రాఫ్ట్​ ట్యూబ్​ ద్వారా పంపులోకి నీళ్లు చేరుతాయి. 

145 మెగావాట్ల కెపాసిటీ గల మోటారును స్విచ్​ఆన్​చేసి, 104 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్​చేసి నార్లాపూర్​ రిజర్వాయర్​లో పోస్తారు. ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసే నీళ్లతో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ప్రతి ఊర్లో గ్రామ దేవతలకు 17న జలాభిషేకం చేస్తారు. సభ ఏర్పాట్లను మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు, కొల్లాపూర్​ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పనులను లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, సీఈ హమీద్ ఖాన్ తదితరులు చూస్తున్నారు. 

ALSO READ: ఇయ్యాల(సెప్టెంబర్ 16) హైదరాబాద్కు అమిత్ షా

జన సమీకరణ బాధ్యత అధికారులకే..

ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమం కావడంతో సీఎం బహిరంగ సభకు జన సమీకరణ బాధ్యతను వివిధ శాఖల అధికారులకు అప్పగించారు.