మన దగ్గర ఉన్న అమ్మ ఒడి వాహనాలు దేశంలో ఎక్కడా లేవ్​ : కేసీఆర్

మన దగ్గర ఉన్న అమ్మ ఒడి వాహనాలు దేశంలో ఎక్కడా లేవ్​ :  కేసీఆర్

 

  • రాష్ట్రంలో డాక్టర్లు.. ఏటా .. పది వేల మంది
  • 5 ప్రభుత్వ మెడికల్​ కాలేజీల నుంచి 26కు పెంచినం: సీఎం కేసీఆర్
  • మారుమూల పల్లెల్లోని గర్భిణులను సేఫ్​గా పీహెచ్​సీలకు చేరుస్తున్నయ్​
  • సర్కార్​ దవాఖాన్లలో అద్భుత సేవలు అందేలా హరీశ్​ కృషి చేస్తున్నరని ప్రశంస
  • తెలంగాణ ఆచరిస్తుంటే.. దేశం అనుసరిస్తున్నది: మంత్రి హరీశ్‌
  • 9 మెడికల్ కాలేజీలకు వర్చువల్​గా ప్రారంభోత్సవం

హైదరాబాద్, వెలుగు:  వైద్య రంగంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రభుత్వ దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో ఎటువంటి కొరతలున్నా తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హారీశ్‌రావు డైనమిక్‌గా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీలను సీఎం శుక్రవారం ప్రగతిభవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చే నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు 26కు పెంచామని, వచ్చే ఏడాది మరో 8 ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి 8,515 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య పది వేలకు చేరుతుందని, ఏటా పది వేల మంది డాక్టర్లు అవుతారని కేసీఆర్​ వివరించారు. 

మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి తెల్ల రక్త కణాలు ఎలా పనిచేస్తాయో, తెల్ల కోటు డాక్టర్లు కూడా అలాగే పనిచేస్తారని అన్నారు. ఈ రాష్ట్రపు డాక్టర్లు దేశానికి ఆదర్శంగా నిలుస్తారని సీఎం ఆకాంక్షించారు. ‘‘వైద్య వృత్తి పవిత్రమైంది. కొంతమంది దీనికి చెడుపేరు తెచ్చారు. తెలంగాణ వైద్యులంటే గొప్ప పేరు రావాలి. చదువులో గొప్ప విజయాలు సాధించి మంచి డాక్టర్లుగా ఎదగాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలి’’ అని సూచించారు. 

అమ్మ ఒడి వాహనాలు దేశంలో ఎక్కడా లేవు

కరోనా వంటి విపత్కర పరిస్థితులను తట్టుకునేలా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. మెడికల్ కాలేజీలు,  హైదరాబాద్​ నగరం నలువైపులా టిమ్స్‌‌‌‌లు, వరంగల్ హెల్త్ సిటీ వంటివన్నీ ఇందులో భాగమేనని చెప్పారు. అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేసి గూడాలు, తండాలు, మారుమూల పల్లెలకు చెందిన గర్భిణులను పీహెచ్ సీలకు తీసుకువస్తున్నామని ఆయన చెప్పారు. గర్భిణులకు రక్తహీనత లేకుండా చూసుకోవడం, ప్రసవం అయ్యాక కూడా అదే వాహనంలో ఇంటిలోకి దించడం చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి విధానం అమలు కావడం లేదన్నారు. ‘‘కేసీఆర్ కిట్ తోపాటు న్యూట్రీషన్ కిట్స్ కూడా ప్రవేశ పెట్టినం. అది చాలా ఆనందకరమైన విషయం. లక్షాధికారులు తినే నెయ్యి , ఖర్జురా పండ్లు వంటి అనేక ఖరీదైన బలవర్థకమైన ఆహారపదార్థాలు న్యూట్రీషన్ కిట్​లో ఉన్నయ్​” అని ఆయన వివరించారు. ప్రభుత్వ దవాఖాన్లలో అద్భుతమైన సేవలు అందేలా మంత్రి హరీశ్‌‌ కృషి చేస్తున్నారని  కేసీఆర్​ ప్రశంసించారు. 

ALSO READ: నర్సాపూర్ టికెట్..వదులుకునే ప్రసక్తే లేదు: మదన్ రెడ్డి

దేశ వైద్యరంగ చరిత్రలోనే ఇది మొదటిసారి: హరీశ్

ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి అని, ఇది సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం అని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలన్న సీఎం మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించామని చెప్పారు. గతేడాది 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించిందని, ఈ ఏడాది 9 కాలేజీలు ప్రారంభించి మన రికార్డును మనమే అధిగమించామని ఆయన తెలిపారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతంగా ఉందన్నారు.  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని హరీశ్​రావు అన్నారు. 

‘‘ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేది. దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసిఆర్‌‌‌‌కు దక్కుతుంది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నది. మెడికల్ కాలేజీల్లో చేరిన స్టూడెంట్స్‌‌ అందరూ బాగా చదువుకోవాలి. వారికి శుభాకాంక్షలు” అని ఆయన తెలిపారు. మంత్రి హరీశ్‌‌రావు, సీఎస్ శాంతికుమారి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి తదితరులు, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్‌‌‌‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌‌‌‌, టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి, పలువురు ఎంపీలు, మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.