ఇయ్యాల మెదక్కు కేసీఆర్.. షెడ్యూల్ ఇదే

ఇయ్యాల మెదక్కు కేసీఆర్.. షెడ్యూల్ ఇదే

 

  • మెదక్ ​నుంచే  కేసీఆర్​ ప్రచారం
  • నేడు బహిరంగ సభ..  మంత్రి హరీశ్​ వెల్లడి
  • మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యం
  • కేసీఆర్​ వ్యూహంతో ప్రతిపక్షాలు కకావికలం
  • బీజేపీ డీలా... కాంగ్రెస్​ది ఉత్త గోల అని కామెంట్లు

మెదక్​, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్​ఎస్​ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మెట్టమొదటి బహిరంగ సభ బుధవారం మెదక్ లో నిర్వహిస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సభ నుంచి సీఎం కేసీఆర్​ ప్రగతి శంఖం పూరిస్తారని మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఎన్నికలకు చాలా రోజుల ముందు ఒకేసారి వంద మందికిపైగా అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర బీఆర్​ఎస్​కు తప్ప మరే పార్టీకి లేదని అన్నారు. అభ్యర్థుల ఖరారుతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్​ఎస్​ క్యాడర్​లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నదని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభిస్తున్నదని పేర్కొన్నారు. 

కేసీఆర్​ పర్యటన నేపథ్యంలో మంగళవారం హరీశ్​రావు మెదక్​ చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సారి 10కి 10 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌‌ఎస్​ అధినేత వ్యూహాన్ని ఏ పార్టీ ఊహించలేదని, ఒకేసారి అభ్యర్థుల ప్రకటనతో ప్రతిపక్షాలు కకావికలం అయ్యాయని అన్నారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా డీలా పడిపోయింది.  కాంగ్రెస్​ పార్టీది ఉత్త గోల మాత్రమే. ప్రతిపక్షాల  గ్లోబెల్స్​ ప్రచారంతో ప్రజల మనసు గెలవలేరు. ఎవరు అవాకులు, చెవాకులు పేలినా ఎవరూ పట్టించుకోరు” అని హరీశ్ అన్నారు. 

ఇదీ సీఎం పర్యటన షెడ్యూల్​

సీఎం కేసీఆర్​ బుధవారం మెదక్​లో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్​ఎస్​ ఆఫీస్​ను  ఆయన ఓపెన్​ చేస్తారు. దివ్యాంగులకు పెంచిన పింఛన్లు, టేకేదార్లకు ఆసరా పింఛన్లను మెదక్​ నుంచే ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కేసీఆర్​ ఉదయం 11 గంటలకు హైదరాబాద్​ నుంచి బస్సులో బయల్దేరి రోడ్డు మార్గంలో వయా నర్సాపూర్​ మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు మెదక్​ చేరుకుంటారు. ముందుగా బీఆర్​ఎస్​ బిల్డింగ్​ను ఓపెన్​ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.20 గంటలకు ఎస్పీ ఆఫీస్​ను, 1.40 గంటలకు ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ బిల్డింగ్​ ను ఓపెన్​ చేస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు కొత్త కలెక్టరేట్​లో పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తారు. ఆపై జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల సీఎస్​ఐ గ్రౌండ్​లో జరిగే ప్రగతి నివేదన సభలో ప్రసంగిస్తారు.  మంత్రి హరీశ్​ రావు, మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి మంగళవారం ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీస్, బహిరంగ సభా స్థలిని పరిశీలించి.. కలెక్టర్, ఎస్పీ, అధికారులకు తగు సూచనలు చేశారు.