- ..సంగారెడ్డి ఆస్పత్రికి తరలించిన పోలీసులు
- అనంతరం మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు
సంగారెడ్డి, వెలుగు: లగచర్ల దాడి కేసులో నిందితుడు, రైతు హీర్యానాయక్‌ను పోలీసులు చికిత్స కోసం బేడీలు వేసి హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హీర్యా నాయక్ మూడు రోజుల కింద చాతీలో నొప్పి ఉందని చెప్పడంతో అప్పుడే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన పరీక్షలు చేయించి తిరిగి సంగారెడ్డి జైలుకు తీసుకొచ్చారు.
గురువారం తెల్లవారుజామున మళ్లీ చాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. ఆయనకు బేడీలు వేసి తరలించారు. హాస్పిటల్లో ఈసీజీ, 2 డీఎకో పరీక్షలు చేయించారు. సెకండ్ ఒపీనియన్ కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.
గతంలో ఒకసారి..
హీర్యా నాయక్ కు ఇదివరకే గుండె సంబంధమైన సమస్య ఉందని ఆయన తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. మూడు నెలల కింద ఇంటి వద్ద ఉండగా ఒకసారి చాతిలో నొప్పి వచ్చిందని.. ఆస్పత్రికి తీసుకెళ్తే స్టంట్ వేయాలని డాక్టర్లు చెప్పారని అన్నారు. కానీ, డబ్బులు లేక సర్జరీ చేయించలేదని తెలిపారు. తమ కొడుకుకు మెరుగైన వైద్యం చేయించి కాపాడాలని ఆ తల్లిదండ్రులు కోరారు. అయితే విషయం తెలుసుకున్న సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హీర్యాను కలిసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.