- 21 ప్యాకేజీ పనులు పూర్తయితే రూరల్, బాల్కొండ రైతులకు మేలు
- బాజిరెడ్డి సీనియర్పొలిటీషియన్, ప్రజా నాయకుడు
- రూరల్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
నిజామాబాద్, వెలుగు: మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేస్తామని, తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని బీఆర్ఎస్అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. ‘గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్లో 3,085 మందికి పోడు పట్టాలు ఇచ్చాం. ఇంకా కొందరికి ఇవ్వాలని అడుగుతున్నారు.
అదేమీ పెద్ద విషయం కాదు. ఎన్నికల తర్వాత పరిశీలించి, పరిష్కరిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్21 ప్యాకేజీ పనులు పూర్తయితే జిల్లాలోని రూరల్, బాల్కొండ నియోజకవర్గాల రైతులకు మేలు జరుగుతుంది. ఇజ్రయెల్ టెక్నాలజీతో ప్రతి మూడెకరాలకు ఔట్లెట్ పెట్టి అద్భుతంగా సాగునీరందిస్తాం’ అని కేసీఆర్ చెప్పారు. ‘చిన్నప్పుడు బీడీలు చేసే వారిండ్లలో పెరిగా. బీడీలు చేసే వారి బాధలు, వాళ్లకు వచ్చే ఆరోగ్య సమస్యలు నాకు తెలుసు.
అందుకే వారికి ఆసరా పింఛన్ ఇస్తున్నా. ఎలాంటి కట్ఆఫ్లేకుండా బీడీ కార్మికులందరికీ పింఛన్ ఇస్తాం. ప్యాకర్స్, టేకేదార్లకూ కూడా అందిస్తామని’ కేసీఆర్తెలిపారు. గల్ఫ్వెళ్లే వారి కుటుంబాలకు బీమా సౌలత్ కల్పిస్తామన్నారు. ‘రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రాజకీయాల్లో సీనియర్ లీడర్. ఆయన ప్రజా నాయకుడు, మంచి నేత. ఎప్పుడు చూసినా ఆయన ఇంటి నిండా ప్రజలు కనిపిస్తారు. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే సెగ్మెంట్అవసరాలు నేనే చూస్తా’ అన్నారు.
మూడుసార్లు టికెట్ ఇచ్చిన్రు
ఎన్నికల్లో మూడుసార్లు బీఆర్ఎస్తరఫున పోటీ చేసే అవకాశం లభించింది. ఇదేవరకే రెండుసార్లు గెలిచా, మూడోసారి కూడా ప్రజలు ఆశీర్వాదిస్తారనే నమ్మకం ఉందని సిట్టింగ్ఎమ్మెల్యే, రూరల్అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తాను ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న కాలంలో 43 వేల మందిని గవర్నమెంట్లో విలీనం చేసే నిర్ణయం తీసుకోవడం ఎనలేని సంతోషానచ్చిందని ఆయన అన్నారు. ధర్పల్లిలోని వంద పడకల హాస్పిటల్‌కు నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్కాలేజీ ఇవ్వాలని కోరారు. డిగ్రీ కాలేజీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ అవసరమన్నారు. జక్రాన్‌పల్లిలో రూ.100 కోట్లతో విమానాశ్రయం నిర్మించాలని కోరారు. గుండారంను మండల కేంద్రం చేయాలన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్తదితరులు పాల్గొన్నారు.