వచ్చే అకడమిక్ ​ఇయర్​లో స్పోర్ట్స్​ వర్సిటీ

వచ్చే అకడమిక్ ​ఇయర్​లో స్పోర్ట్స్​ వర్సిటీ
  • స్పోర్ట్స్ ​విలేజ్​గా గచ్చిబౌలి: సీఎం రేవంత్​రెడ్డి
  • ఒలింపిక్స్ ​స్థాయికి హైదరాబాద్ ​స్టేడియాలు అప్ గ్రేడ్​ చేస్తం
  • 2028లో ఒలింపిక్స్​ మెడల్స్​ గెలవడమే లక్ష్యంగా ప్రణాళిక
  • రాష్ట్రంలో క్రీడలకు పూర్వవైభవం తెస్తామని వెల్లడి
  • హైదరాబాద్​ మారథాన్​ ముగింపు కార్యక్రమానికి హాజరు

హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: వచ్చే అకడమిక్​ ఇయర్​లోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్​ యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఇందుకు దక్షిణ కొరియా స్పోర్ట్స్​ వర్సిటీ సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. గచ్చిబౌలిని స్పోర్ట్స్​ విలేజ్​గా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2028 ఒలింపిక్స్​లో తెలంగాణ నుంచి అత్యధిక మెడల్స్​ సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. 2036 లో ఒలింపిక్స్​ నిర్వహణ అవకాశం ఇండియాకు దక్కితే.. హైదరాబాద్​ నగరంలోనే క్రీడలు నిర్వహించే ప్రధాన వేదిక ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీని అభ్యర్థించినట్టు తెలిపారు. 

హైదరాబాద్ రన్నర్స్​ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఎన్ఎండీసీ హైదరాబాద్​ మారథాన్ ​నిర్వహించారు. ఈ మారథాన్​ నగరంలోని పీపుల్స్​ ప్లాజా వద్ద ఫుల్​ మారథాన్​(42  కిలోమీటర్లు), హాఫ్​ మారథాన్​(21 కిలోమీటర్లు) ప్రారంభమై.. నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద, 10కే రన్​ హైటెక్స్​లో ప్రారంభమై.. గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారథాన్​లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్​ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడలు, క్రీడల నిర్వహణకు కేరాఫ్​అడ్రస్​గా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని స్టేడియాలను ఒలింపిక్స్ స్థాయికి అప్​గ్రేడ్​ చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రీడా ప్రాంగణాల్లో సౌలతులను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. రాబోయే ఖేలో ఇండియా యువ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలిసి, విన్నవించామని చెప్పారు. 

Also Read:-తెలంగాణను డ్రగ్స్​ రహిత రాష్ట్రంగా మారుస్తం

దేశంలో ఏ క్రీడలు జరిగినా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రీడల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించాల్సిన హైదరాబాద్ నగరం గత బీఆర్ఎస్​ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాధాన్యత కోల్పోయిందని చెప్పారు. తెలంగాణ యువతను క్రీడలవైపు  మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు, మాజీ ఎంపీ హనుమంతరావు, శాట్​ చైర్మన్​ శివసేనారెడ్డి, సైబరాబాద్​ సీపీ అవినాశ్​​మహంతి, ట్రాఫిక్​ జాయింట్​సీపీ జోయల్​డేవిస్, మాదాపూర్​డీసీపీ వినీత్,​ బాక్సర్​ నిఖత్​ జరీన్,  మారథాన్​ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా మారథాన్..

హైదరాబాద్ రన్నర్స్​సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 13వ  ఎడిషన్​ ఎన్ఎండీసీ హైదరాబాద్​ మారథాన్​ ఆదివారం ఉదయం నెక్లెస్​ రోడ్డులోని పీపుల్స్​ ప్లాజాలో ప్రారంభమైంది. పీపుల్స్​ ప్లాజా నుంచి ఫుల్ మారథాన్, హాఫ్​ మారథాన్​, హైటెక్స్​ వేదిక నుంచి 10కే రన్​ ప్రారంభమై.. నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు సాగింది. ఈ రన్​లో నగరంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 25వేల మంది రన్నర్స్​ఉత్సాహంగా పాల్గొన్నారు. సాఫ్ట్​వేర్, ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, చిన్నారులు, స్టూడెంట్స్,  స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పార్టిసిపేట్​ చేశారు. ఈ మారథాన్​ ద్వారా 80 లక్షల చారిటీ అమౌంట్​ రైజ్ అయినట్టు నిర్వాహకులు తెలిపారు.