
- ట్రిపుల్ఆర్ సౌత్ భాగాన్ని మంజూరు చేయండి
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
- గంటపాటు సమావేశం.. ఆరు కీలక ప్రాజెక్టులపై చర్చ
- మూసీ– -గోదావరి లింక్ ప్రాజెక్టు కోసం 20 వేల కోట్లు కావాలి
- రీజినల్ రింగ్ రైల్, డ్రైపోర్ట్ మంజూరు చేయండి
- ఇండియా సెమీ కండక్టర్ మిషన్‌కు అనుమతి ఇవ్వండి
- రాష్ట్రంలో 2016 నుంచి ఆవాస్ యోజన అమలైతలేదన్న ప్రధానమంత్రి
- అమలు కోసం కృషి చేయాలని సీఎంకు సూచన
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన ఆరు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇందులో హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు పర్మిషన్ ఇవ్వాలని, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం పదేండ్లపాటు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి పెట్టలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం తమ ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేసి.. నిరుడు నవంబర్ 4న కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేసిందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని ప్రధానిని కోరారు.
బుధవారం ఉదయం పదిన్నరకు ప్రధాని మోదీతో ఢిల్లీ లోని ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో రైల్ ఫేజ్ 2, ట్రిపుల్ ఆర్ దక్షిణభాగం మంజూరు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహకారం, అదనపు ఐపీఎస్ ల కేటాయింపు, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టుకు అనుమతి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మెట్రో ఫేజ్2ను కేంద్ర కేబినెట్లో ఆమోదించండి
హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్ 2 కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన 5 కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని ప్రధా నికి సీఎం తెలిపారు. కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్ట్‌కు చేపడ్తున్నట్లు వివరించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతం (రూ. 4,230 కోట్లు), రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం (రూ.7,313 కోట్లు), రుణ భాగంగా 48 శాతం(రూ. 11,693 కోట్లు) గా ఉందన్నారు.
బెంగళూరు మెట్రో సెకండ్ ఫేజ్ (రూ.14,788 కోట్లు)ను 2021లో, థర్డ్ ఫేజ్(రూ. 15,611కోట్లు) ను 2024 లో కేంద్రం ఆమోదించినట్లు ఆయన గుర్తు చేశారు. అలాగే, చెన్నై మెట్రో సెకండ్ ఫేజ్(రూ.63,246కోట్లు)ను 2024 లో ఆమోదం పొందిందని వివరించారు. హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలన్నారు.
ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి
ఐటీ రంగం, ఫార్మా పరిశ్రమలు, లాజిస్టిక్ పార్క్ లతో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రాబోయే ఐదేండ్లలో మరింత రద్దీగా మారుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) అవశ్యకత, అవసరాన్ని స్పష్టంగా చెప్పారు.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయిందని, దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానికి సీఎం విన్నవించారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ట్రిపుల్ ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు.
ట్రిపుల్ ఆర్కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని వివరించారు. ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో కనెక్టివిటీ సులభమవుతుందన్నారు. అందువల్ల రీజినల్ రింగ్ రైలుకూ అనుమతివ్వాలని ప్రధానమంత్రిని కోరారు.
సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్‌లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులపై సీఎంకు ప్రధాని నివేదిక
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఓ నివేది క అందజేశారు. 2017 నుంచి 2022 వరకు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉంటూ వస్తున్న అంశాలపై దృష్టి పెట్టాలని, వాటిని పరిష్కరించాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016–-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని, దాని అమలుపై ఫోకస్ పెట్టాలన్నారు.
ఆవాస్ 2018 మొబైల్ అప్లికేషన్ ద్వారా 2025 మార్చి 31 నాటికల్లా సర్వే కంప్లీట్ చేయాలని, అర్హులను గుర్తించాలని సూచించారు. అలాగే, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మూడు మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోడ్ల నిర్మాణం, అటవీ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ప్రధాని అన్నారు.
తెలంగాణలోని మూడు నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రివైజ్ ఎస్టిమేట్స్ పంపించాలని ఆయన సూచించారు. చొక్కా రావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 కింద 18,189.53 కోట్ల విలువైన పనులకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
బీబీనగర్ ఎయిమ్స్‌కు రూ.1,365.95 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కనెక్షన్, వాటర్ సప్లయ్ కోసం పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. శంషాబాద్‌లో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ భూమి కోసం పెండింగ్‌లో ఉన్న రూ.150 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
మనోహరాబాద్– కొత్తపల్లి నూతన రైల్వే లైన్, కాజీపేట– విజయవాడ మూడో లైన్ విద్యుదీకరణకు సంబంధించి రూ. 3,113.48 కోట్లు, భూసేకరణ అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా క్లియర్ చేయాలన్నారు. ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇండియా సెమీ కండక్టర్ మిషన్‌కు పర్మిషన్ కావాలి
తెలంగాణను అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ అండర్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో పేరొందిన సంస్థలు ఇప్పటికే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాయన్నారు. అలాగే, ఫాక్స్ కాన్, కేన్స్ లాంటి ప్రముఖ సంస్థలు యూనిట్లు నెలకొల్పాయని వివరించారు.
ఈ పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుకూలతలు రాష్ట్రంలో ఉన్నాయని, భూకంపాల నుంచి సేఫ్‌గా ఉండే నైసర్గిక స్వరూపంతో పాటు పరిశ్రమల ఏర్పాటు, అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు, నిపుణులు అందుబాటులో ఉండడంతో సెమీ కండక్టర్ పరిశ్రమల పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని ఆయన తెలిపారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలని ప్రధానిని సీఎం రేవంత్ కోరారు.
మూసీ-గోదావరి లింక్‌కు రూ. 20 వేల కోట్లు కావాలి
తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని.. రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తున్నదని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వివరించారు. ప్రస్తుతం ఆ మూసీ పారిశ్రామిక వ్యర్థాలు, ఆక్రమణలతో మురికి కూపంగా మారిందన్నారు. మూసీని ప్రక్షాళన చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ -గోదావరి నదుల అనుసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయం అందజేయాలని ప్రధానమంత్రిని కోరారు. కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఈ నిధులు ఇవ్వాలన్నారు. అలాగే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని అడిగారు.
29 ఐపీఎస్ పోస్ట్‌లు ఇవ్వండి
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తెలంగాణకు కేవలం 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ఆ తర్వాత 2016 లో జరిగిన కేడర్ రివ్యూలో మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయన్నారు. అయితే ఇప్పుడున్న అవసరాలకు ఈ అధికారుల సంఖ్య సరిపోవడం లేదని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులతో కొత్తగా అమల్లోకి వచ్చిన 10 పోలీస్ యూనిట్లను 29 పోలీస్ యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించామన్నారు.
సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు.