మా పాలసీ ప్రజాస్వామ్యం.. మాటిచ్చినం.. పునరుద్ధరించినం: సీఎం రేవంత్​రెడ్డి

  • ఏడాదిలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ప్రజా ప్రభుత్వం
  • 55 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ..విజయవంతంగా కులగణన సర్వే
  • రూ.21 వేల కోట్ల పంట రుణాలు మాఫీ.. సన్న వడ్లకు రూ. 500 బోనస్
  • ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం
  • రూ. 500కే గ్యాస్.. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్​
  • 200 శాతానికిపైగా పెరిగిన పెట్టుబడులు
  • ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది
  • నాపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు
  • పక్క రాష్ట్రాలు మనల్ని ఫాలో అయితున్నయని​ ట్వీట్​

హైదరాబాద్, వెలుగు: తొలి ఏడాది పాలనలో రుణమాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు వంటి అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని  సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను రాష్ట్రంలో పునరుద్ధరించామని చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. 

ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్​ (ట్విట్టర్​)లో సీఎం రేవంత్​రెడ్డి పోస్ట్​ చేశారు. ఆరు గ్యారంటీలతోపాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని, అదే తమ పాలసీ అని అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో కాంగ్రెస్​ పార్టీ మాట ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే  ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకొచ్చామని సీఎం రేవంత్​రెడ్డి ట్వీట్​ చేశారు. 

తొలిఏడాది పాలనలో చేపట్టిన పథకాలు, సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. తనపై నమ్మకం ఉంచిన రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజలందరి నమ్మకా నికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను నా ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. 

ఈ మొదటి సంవత్సరంలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల వంటి అంశాల్లో మీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. మన దగ్గర అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు, కులగణన, పర్యావరణ కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలను పక్క రాష్ట్రాలు కూడా అనుకరిస్తున్నాయి” అని వెల్లడించారు.

Also Read : నేడు (డిసెంబర్ 9, 2024) సెక్రటేరియెట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

ప్రజా ప్రభుత్వం సాధించిన కొన్ని కీలక విజయాలు మరోసారి రాష్ట్ర ప్రజలకు గుర్తుచేయాలనుకుంటున్నానని సీఎం తెలిపారు. మహిళా సంక్షేమం కోసం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.  25 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని, సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతులకు 24/7 ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని వివరించారు. 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు జరుగుతున్నాయన్నారు.

55వేలకు పైగా ఉద్యోగాలు

అధికారం చేపట్టిన తర్వాత మెుదటి ఏడాదిలోనే యువతకు 55 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు అందజేశామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలను సృష్టించామని పేర్కొన్నారు. డ్రగ్స్​ నిర్మూలన, డ్రగ్స్​పై పోరాటం చేపడ్తున్నామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని ఆయన వివరించారు. తొమ్మిది నెలల్లో ఎఫ్‌‌‌‌డీఐలు రెట్టింపయ్యాయని,  11 నెలల్లో మొత్తం పెట్టుబడులు 200 శాతానికి పైగా పెరిగాయని వెల్లడించారు. క్లైమేట్ క్రైసిస్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అర్బన్ రీఇమాజినేషన్ ప్రోగ్రామ్‌‌‌‌ను చేపట్టిన మొదటి నగరంగా  దేశంలోనే హైదరాబాద్​ను మార్చుకున్నామని ట్వీట్​ చేశారు.


సమగ్ర కులగణన చేపట్టినం

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో సహా అనేక ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టామని సీఎం రేవంత్​రెడ్డి వివరించారు. ట్రాన్స్‌‌‌‌జెండర్ మార్షల్స్ ద్వారా ట్రాఫిక్‌‌‌‌ను నిర్వహించే మొదటి నగరంగా దేశంలోనే హైదరాబాద్​ రికార్డు సృష్టించ బోతున్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన కూడా చేపట్టుకున్నామని వెల్లడించారు. ఇదంతా రాష్ట్ర ప్రజల సహాయ సహకారంతోనే సాధ్యమైందని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సీఎం రేవంత్​ ట్వీట్​ చేశారు.