- నవంబర్ 30లోపు పూర్తి చేసి మోదీపై యుద్ధానికి రెడీ కావాలి : సీఎం రేవంత్
- కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. మెగా హెల్త్ చెకప్ లాంటిది
- చట్టాన్ని అమలు చేయడం తప్ప..నాకంటూ ప్రత్యేక ఎజెండా ఉండదు
- కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదు
- గ్రూప్ 1 మెయిన్స్‌కు ఎంపికైన వాళ్లలో 57 శాతం మంది బీసీలే
- రాజకీయ మనుగడ కోసమే ప్రతిపక్షాల తాపత్రయం అని సీఎం ఫైర్
- ప్రతి కార్యకర్త కులగణనను సక్సెస్ చేయాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- కులగణన సంవిధాన్ సమ్మేళనం కోసం 5న రాష్ట్రానికి రాహుల్ రాక?
హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే జనగణనకు తెలంగాణ సమగ్ర కులగణన రోల్ మోడల్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రం చేపట్టబోయే కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం ప్రజలకు పంచడమే కాంగ్రెస్ విధానం’’ అని స్పష్టం చేశారు. నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్తు యుద్ధానికి సిద్ధం కావాలని, ఈ యుద్ధం ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేలా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు. తెలంగాణ చేపట్టే కులగణన మున్ముందు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందని అన్నారు.
వచ్చే నెల 6 నుంచి ప్రారంభించనున్న కులగణనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి మద్దతు కోరుతూ బుధవారం పీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక, ఆర్థిక రాజకీయ కులగణన చేస్తామని గతంలో రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టడం ప్రతి కాంగ్రెస్ నేత బాధ్యత అని ఆయన అన్నారు.
కులగణనకు పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా ప్రతి క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కేడర్, లీడర్స్‌పై ఉందని చెప్పారు. కులగణనకు సమన్వయం కోసం కాంగ్రెస్ తరఫున 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్లను నియమించాలని పీసీసీ నాయకత్వానికి ఆయన సూచించారు. బాధ్యతగా పని చేస్తే కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదని నేతలను ఆయన హెచ్చరించారు.
పార్టీ విధానాన్ని అమలు చేయడమే విధానం
రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా.. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో సోనియగాంధీ సఫలీకృతం అయ్యారని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాటను సోనియాగాంధీ నెరవేర్చారని, గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందని తెలిపారు. ‘‘రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డికి గుర్తింపు ఇచ్చింది. మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చింది. పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావు లేదు.. చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులే. మనం కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం” అని చెప్పారు.
గ్రూప్ 1మెయిన్స్‌కు ఎంపికైన వాళ్లలో 57.11 శాతం బీసీలే
‘‘ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10 నెలల్లో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం” అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. గ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూశాయని.. జీవో, నోటిఫికేషన్, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినప్పుడు కోర్టుకు పోలేదు కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారని అన్నారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్ ను కొట్టేసిందని తెలిపారు.
‘‘అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని కొందరు ఒక వాదన తీసుకొచ్చారు. మెయిన్స్‌కు సెలెక్ట్ అయిన 31 వేల 383 మందిలో 10 శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. 57.11 శాతం బీసీలు, 15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలెక్ట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారు’’ అని ఆయన వివరించారు. కాంగ్రెస్ కు నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదని కేడర్‌కు హెచ్చరించారు. ‘‘రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తడు తప్ప... వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడు. ప్రతిపక్షాల కుట్రలను ప్రతి కాంగ్రెస్ లీడర్, కార్యకర్త తిప్పికొట్టాలి” అని సూచించారు.
కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
రాష్ట్రంలో చేపట్టబోయే కులగణన కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. నవంబర్ 2న 33 జిల్లాల డీసీసీ అధ్యక్షులతో సమావేశం ఉంటుందని, కులగణనను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఇందులో చర్చిస్తామని చెప్పారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణనపై ఎలాంటి అనుమానాలు ఉన్నా... గాంధీభవన్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తగిన సమాచారం ఇస్తామన్నారు.
రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, భారత్ జోడో యాత్రలో ఆయన కులగణనపై స్పష్టమైన ప్రకటన చేశారని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినందునే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిపై సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని మహేశ్‌గౌడ్ వివరించారు. దీనికి పార్టీ సంపూర్ణంగా అండగా నిలబడి విజయవంతం చేసే బాధ్యతను తీసుకుంటుందన్నారు.
5న రాష్ట్రానికి రాహుల్?
వచ్చే నెల 5న రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కులగణనకు సంబంధించి పార్టీ చేపట్టే సంవిధాన్ సమ్మేళనం కార్యక్రమంలో రాహుల్ పాల్గొనేలా చూడాలని పీసీసీ నాయకత్వం హైకమాండ్ ను కోరింది. దీనికి పార్టీ హైకమాండ్ సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో రాహుల్ టూర్ పై క్లారిటీ రానుంది.