- కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తం.. ఇదే మా కమిట్‌మెంట్
- అట్ల ఇచ్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ సిద్ధమా ?
- అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
- ‘ఎవరెంత ఉన్నారో వారికంత..’ నినాదంతో కులగణన చేపట్టినం
- విద్య, ఉపాధి, రాజకీయాల్లో న్యాయం చేస్తం.. భవిష్యత్‌లో స్కీమ్స్‌కు ఈ వివరాలు దిక్సూచి
- భూముల లెక్కలు చెప్పాల్సి వస్తుందనే సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, డీకే అరుణ పాల్గొనలే
- తెలంగాణ లెక్కనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే చేయాలని అసెంబ్లీ తీర్మానం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్ కూడా 42 శాతం సీట్లను బీసీలకు ఇచ్చేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ‘ఎవరెంత ఉన్నారో వారికంత..’ అనే నినాదంతో విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే కులగణన చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. కులగణన నివేదిక ప్రకారం 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పిస్తామన్నారు.
కులగణనకు సంబంధించిన వివరాలపై మంగళవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘చట్టపరంగా బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి.. అది కుదరకపోతే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తం.. ఇందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని సీఎం అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దగ్గర కూడా మాట తీసుకున్న.. ఇది మా కమిట్‌మెంట్.. అన్ని పార్టీలు బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలి.. బీఆర్ఎస్, బీజేపీ ఇస్తయా? రాజకీయంగా, నైతికంగా కట్టుబడి బలహీనవర్గాలకు 42 శాతం సీట్లు ఇద్దాం.. ఇందుకు మీ రెండు పార్టీలు సిద్ధమేనా..? అసెంబ్లీ వేదికగా చెప్పాలని సవాల్ చేస్తున్న” అని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ, ఉపాధి పథకాలకు కులగణన సర్వే నివేదిక దిక్సూచిగా నిలుస్తుందని సీఎం అన్నారు.
సంఘాలు, మేధావుల అభిప్రాయాలూ తీస్కున్నం
కులగణన సర్వేలో పాల్గొన్న అందరినీ రాజకీయాలకతీతంగా అభినందించాలని సీఎం రేవంత్ సూచించారు. కులగణన సర్వే భవిష్యత్‌లో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. బీసీ లెక్కలు తేల్చి వారికి అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో హామీ ఇచ్చారని.. ఆయన ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టామని తెలిపారు. ‘‘మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ వేసి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాం. కర్నాటక, బిహార్ సర్వేలతో సహా వివిధ సర్వేలను అధ్యయనం చేశాం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ వ్యాప్తంగా ఈ సర్వే చేపట్టాం.
ఈ క్రమంలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నాం. 75 అంశాల ప్రాతిపదికగా సర్వే నిర్వహించాం. నవంబర్ 9 నుంచి రాష్ట్రంలో దాదాపు 50 రోజులపాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగింది. మొత్తం 1.12 కోట్ల కుటుంబాలను సర్వేచేశాం. 3.56 లక్షల కుటుంబాల్లో సర్వే జరగలేదు. ఈ సర్వే డేటాను సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు వాడుతాం” అని ఆయన చెప్పారు.
వాళ్లు ఎందుకు సర్వేలో పాల్గొనలే?
సామాజిక కులగణన సర్వేలో కావాలని కొందరు పాల్గొనలేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటి సర్వే చేస్తే కొందరు ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొనలేదు. అందులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ వంటి వారు ఉన్నారు. ఇదే విషయంపై ఒకాయనను అడిగితే.. ‘మీరు ఇచ్చిన సర్వేలోని ఐదో పేజీలో భూమి వివరాలు అడిగారు. ఆ ఒక్క దెబ్బకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు’ అని చెప్పారు. మూడు కోట్ల 54 లక్షల మందిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, లీడర్లు, మంత్రులంతా వివరాలు ఇచ్చారు, కానీ, భూముల వివరాలు అడిగినందుకే ఇక్కడున్న కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సర్వేలో పాల్గొనలేదు” అని సీఎం అన్నారు.
జనగణన కంటే పకడ్బందీగా చేపట్టినం
జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారని, ఒక ఎన్యూమరేటర్ రోజుకు 10 ఇండ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేదని తెలిపారు. 8 పేజీల ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామన్నారు. 76 వేల మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు డేటా క్రోడీకరించారని వివరించారు. రూ.160 కోట్లు ఖర్చు చేసి వివరాలు సేకరించామని, నిర్ణయం తీసుకున్న ఏడాదిలోపే సర్వే చేయించామని తెలిపారు. ఇది మోడల్ డాక్యుమెంట్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. విద్య, ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించడానికి ఈ సర్వే నివేదిక పని చేయాలన్నారు.
దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీ తీర్మానం
తెలంగాణ లెక్కనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే చేయాలని అసెంబ్లీ తీర్మానించింది. ఈ మేరకు కేంద్రానికి తీర్మానాన్ని పంపాలని నిర్ణయించింది. కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. “తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల గణన సర్వే నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీనవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది.
రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు , పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో కట్టుబడి ఉంది. దేశ స్వాతంత్ర్యం నాటి నుంచి ఎదురుచూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాలవారి స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానిస్తున్నది” అని సీఎం పేర్కొన్నారు. దీన్ని అసెంబ్లీ ఆమోదించింది.